ఇంట్లో షార్ట్ సర్కూట్‌తో ఓ మహిళ సజీవ దహనమైన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా, మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున కొత్త సంవత్సరం రోజునే ఈ ఘటన జరగడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన తుప్పుడ యాదమ్మ (55) కూతురు నాగమ్మతో కలిసి గత కొంతకాలంగా రేకుల ఇంట్లోనే నివాసం ఉంటోంది. నాగమ్మకు ఆరోగ్యం బాగలేక గత రెండు రోజులుగా పక్కనే ఉన్న తమ్ముడు తిరుపతయ్య ఇంట్లో ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న యాదమ్మ మంగళవారం అర్ధరాత్రి దాటాక రేకుల షెడ్డులోని స్విచ్ బోర్డులో షార్ట్ సర్యూట్‌తో
చెలరేగిన మంటలు దుప్పట్లకు అంటుకుని ఇంట్లో విపరీతంగా మంటలు చెలరేగాయి. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న యాదమ్మ నిద్రలో తప్పించుకోలేక ఆ మంటల్లో సజీవదహనమైంది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంటి నుండి పొగలు రావడం చూసిన చుట్టుపక్కలవారు యాదమ్మ కొడుకు తిరుపతయ్యకు సమాచారం ఇవ్వగా మంటలను ఆర్పి చూసేసరికి అప్పటికే తల్లి పూర్తిగా కాలిపోయి ఉంది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.