ఇంధనం సరఫరాకు 200మంది సైనికులు
లండన్: యుకెలో ఇంధనం సరఫరాకు డ్రైవర్ల కొరత ఏర్పడటంతో సైనిక సిబ్బంది నుంచి 200మందికి తాత్కాలికంగా ఆ బాధ్యత అప్పగించారు. ఆపరేషన్ ఎస్కలిన్ పేరుతో ట్యాంకర్ డ్రైవర్లుగా వారికి శిక్షణ కూడా ఇస్తున్నారు. యుకెలో ఇంధనం నిల్వలు సమృద్ధిగా ఉన్నా, డిమాండ్‌కు తగినట్టుగా సరఫరా జరగకపోవడంతో పంపుల వద్ద క్యూలైన్లు పెరిగిపోయాయని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో సాధారణ పరిస్థితి తేవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు యుకె రక్షణ కార్యదర్శి బెన్‌వాలెస్ తెలిపారు. పంపుల వద్ద క్రమంగా క్యూటైన్లు తగ్గుతున్నాయని, మరో వారంలో పరిస్థితి సర్దుబాటు అవుతుందని ఆశిస్తున్నామని యుకె వాణిజ్య కార్యదర్శి క్వాసీ క్వార్టెంగ్ అన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వినియోగం పెరిగిందని..అయితే,అందుకు తగినట్టుగా సరఫరా గొలుసు అందుబాటులోకి రావడంలో ఇబ్బంది తలెత్తిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా రవాణా వాహనాలకు డ్రైవర్ల కొరత ఏర్పడిందని వారు తెలిపారు.