వాషింగ్టన్: దక్షిణ అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఓ బాలుడు తన 16వ పుట్టిన రోజు వేడుక జరుపుకొంటుండగా కాల్పుల కలకలం జరిగి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆ బాలుని 16వ పుట్టిన రోజు వేడుకలు జరిగిన సమయంలో తలెత్తిన వివాదం కాల్పులకు దారి తీసినట్టు షెరీఫ్ కార్యాలయం అధికారులు అనుమానిస్తున్నారు. ఆ బాలుడు తన స్నేహితులందరినీ మహోగని మాస్టర్ పీస్ డ్యాన్స్ స్టుడియోకి ఆహ్వానించాడు.
పార్టీ జరుగుతున్న సమయంలో వివాదం తలెత్తింది. దుండగులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో చాలా మంది టీనేజర్లే ఉన్నారని ఓ మీడియా సంస్థ తెలిపింది. దీంతో పార్టీ జరిగిన భవనం చుట్టూ భద్రతా బలగాలు మోహరించాయి. ఆ ప్రాంతంలోని వారందరూ కాల్పులకు భయాందోళనలు చెందారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్టు అలబామా రాష్ట్ర గవర్నర్ కే ఐవీ ఓ ప్రకటన విడుదల చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రుల్లో చేర్చారు.