బెంగళూరు: శాంతి, సామరస్యం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి వస్త్రాన్ని ఉపయోగించకూడదనే ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ, హిజాబ్‌కు అనుకూలంగా పిటిషన్ వేసిన విద్యార్థినులు పాఠశాల యూనిఫాం రంగు ఇస్లామీయ హెడ్‌స్క్రాఫ్‌లను ధరించడానికి అనుమతించాలని సోమవారం కర్నాటక హైకోర్టును అభ్యర్థించారు. న్యాయమూర్తులు రితు రాజ్ అవస్థీ, జెఎం ఖాజీ, కృష్ణ ఎం దీక్షిత్‌లతో కూడిన హైకోర్టు సంపూర్ణ ధర్మసనానికి(ఫుల్ బెంచ్) వారు ఈ విజ్ఞప్తి చేసుకున్నారు.
“నేను ప్రభుత్వ ఉత్తర్వును సవాలుచేయడంలేదు. యూనిఫాం రంగు హిజాబ్‌కు అనుమతించమని కోరాను” అని న్యాయవాది దేవదత్ కామత్ తెలిపారు.
ఆయన పటిషన్ వేసిన విద్యార్థినుల తరఫున కోర్టుకు హాజరయ్యారు. కేంద్రీయ పాఠశాలలు యూనిఫాం రంగులో హిజాబ్‌ను(శిరోవస్త్రం) అనుమతించిన విధంగానే కర్నాటక ఉడుపిలోని ప్రభుత్వ ప్రీయూనివర్శిటీ కాలేజ్‌లో కూడా అనుమతించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. శిరోవస్త్రం ధరించడం అనేది మతాచారం. దానిని నియంత్రించడం అంటే భారత రాజ్యాంగంలోని 25వ ఆర్టికల్‌ను ఉల్లంఘించడమే కాగలదన్నారు. ఆయన ఇంకా ఆ విద్యార్థినులు గత రెండు సంవత్సరాలుగా హిజాబ్ ధరించే క్లాసులకు వస్తున్నారని కోర్టుకు తెలిపారు. కాగా వారు హిజాబ్ ధరించి వస్తుండడంతో, ఇతర మత విద్యార్థులు పోటీగా తమ మతాచార ప్రకారం కండువాలు ధరించి వచ్చారని కామత్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ కేసు విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.