మనతెలంగాణ/హైదరాబాద్: వికలాంగులకు చట్టపరంగా, సామాజికంగా రక్షణ ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. వారి కోసం జాతీయ స్థాయిలో వికలాంగుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో వికలాంగుల ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయ వికలాంగుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్‌కు ఇటీవల లేఖ రాశానని, దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. వికలాంగులకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మరిన్ని రిజర్వేషన్లు కల్పించి ప్రాధాన్యతను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉన్నట్లుగానే వికలాంగులకు కూడా జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి కమిషన్లు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో వికలాంగులకు ప్రతి నెల రూ.3,016 చొప్పున పెన్షన్లు ఇస్తున్నామని గుర్తుచేశారు. అనేక రంగాల్లో వికలాంగులు గొప్పగా తమ ప్రావీణ్యాన్ని చాటుకుంటున్నారని ఆయన వివరించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, దైవజ్ఞశర్మ, వికలాంగుల హక్కుల వేదిక చైర్మన్ కొల్లి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Should be set up Disability Commission: Vinod kumar