మనతెలంగాణ/ హైదరాబాద్ : అవినీతి, నియంతృత్వ రాజకీయాలకు దూరంగా ఉండాలని.. దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని.. కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో అమరులైన కెప్టెన్ రాపోలు వీర రాజారెడ్డి తల్లిదండ్రులను కిషన్ రెడ్డి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ’స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 2047 నాటికి పేదరిక నిర్మూలన జరగాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రానున్న రోజుల్లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బిఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ అధోగతి పాలవుతుందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. భూములు కనిపిస్తే చాలు అక్రమించేస్తున్నారని.. వేలం వేసేస్తున్నారని మండిపడ్డారు. ధరణి పేరుతో రైతుల పొట్ట కొడుతున్నారన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు.- కాంగ్రెస్ నాయకులు కమిషన్లు తీసుకుంటే.. బిఆర్‌ఎస్ నేతలు ప్రతి పని, ప్రాజెక్టులో 30 శాతం వాటా తీసుకొని పాలన సాగిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బిఆర్‌ఎస్‌కు వేసినట్లే అది ప్రజలు గమనించాలని కిషన్‌రెడ్డి కోరారు. ఈ వేడుకల్లో ఎంపి డాక్టర్ లక్ష్మణ్, ఇంద్రసేనా రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్.ప్రభాకర్, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరంగా ర్యాలీలో కిషన్‌రెడ్డి
రహ్మత్ నగర్ డివిజన్‌లో జరిగిన తిరంగా ర్యాలీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల మీదుగా సాగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.