- ఇడికి సుప్రీం కోర్టు స్పష్టీకరణ
- ఎన్‌ఎఎన్ స్కామ్ కేసు ఢిల్లీకి బదలీ చేయాలన్న ఇడి పిటిషన్‌పై కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రజల ప్రాథమిక హక్కుల గురించి కూడా ఆలోచించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నాగరిక్ అపుర్తి నిగమ్ (ఎన్‌ఎఎన్) కుంభకోణం కేసును ఛత్తీస్‌గఢ్ నుంచి ఢిల్లీకి బదలీ చేయాలని కోరుతూ ఇడి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తులకు ఉద్దేశించిన రాజ్యాంగం 32వ అధికరణం కింద రిట్ పిటిషన్‌ను ఎలా దాఖలు చేశారని ఇడిని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. తమ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలకు సుప్రీం కోర్టు నుంచి పరిష్కారాన్ని కోరేందుకు వ్యక్తులకు అధికారం ఇస్తూ రాజ్యాంగం 32వ అధికరణం ‘రాజ్యాంగం నివృత్తి హక్కు’ను గ్యారంటీ ఇస్తుంది. ఆ హక్కుల అమలుకు కోర్టును నేరుగా ఆశ్రయించేందుకు అది వారికి వీలు కల్పిస్తుంది. బెంచ్ వ్యాఖ్యల దృష్టా అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు పిటిషన్ ఉపసంహరణకు కోర్టు అనుమతి కోరారు. ‘ఇడికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి ’ అని ఆయన చెప్పారు. ‘ఇడికి ప్రాథమిక హక్కులు ఉన్నట్లయితే, అది ప్రజల ప్రాథమిక హక్కుల గురించి కూడా ఆలోచించాలి’ అని బెంచ్ చమత్కారపూర్వకంగా వ్యాఖ్యానించింది. ఆతరువాత పిటిషన్ ఉపసంహరణకు రాజును కోర్టు అనుమతించింది.