Monday, December 23, 2024

విహెచ్‌కు షోకాజ్?

- Advertisement -
- Advertisement -

ఉత్తమ్‌కుమార్‌పై ఆరోపణల నేపథ్యంలో అధిష్ఠానం సీరియస్

నోటీస్ జారీ చేసే యోచనలో ఎఐసిసి

ఉత్తమ్‌పై ఆరోపణల నేపథ్యంలో అధిష్ఠానం సీరియస్
పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడొద్దంటూ ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేసిన విహెచ్ హనుమంతరావుకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అంబర్‌పేట్ టికెట్ విషయంలో కాంగ్రెస్ ఎంపి, టిపిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. టికెట్లు రాకుండా అడ్డుకుంటున్నారని, అసలు రేవంత్ మీద కామెంట్లు చేయించిందే ఉత్తమ్ అంటూ విహెచ్ ఆరోపించారు. అంతేకాకుండా తననూ, జగ్గారెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపించడానికి ఉత్తమ్ కుట్రలు చేశారని.. బ్లాక్ మెయిల్ చేసి పదవులు తెచ్చుకున్నారంటూ ఫైర్ అయ్యారు.

అయితే విహెచ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా అంతర్గత విబేధాలు మళ్లీ బయటపడ్డాయి. సీనియర్ల మధ్య మొదలైన ఈ చిచ్చు అధిష్టానం వరకు వెళ్లింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే విహెచ్ షోకాజ్ నోటీసు ఇవ్వాలని క్రమశిక్షణా కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఇదే విషయమై అధిష్టానం నుంచి క్రమశిక్షణా కమిటీ ఆదేశాలు అందాయని విహెచ్ నుంచి వివరణ తీసుకోవాలని, ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే విహెచ్‌పై చర్యలు తీసుకోవాలని అధిష్టానం క్రమశిక్షణా కమిటీని ఆదేశించినట్టుగా తెలిసింది.

అధిష్టానానికి, రాష్ట్ర నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో…
ప్రస్తుత పరిస్థితుల్లో విహెచ్ మాటలను సీరియస్‌గా తీసుకున్న ఏఐసిసి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇస్తూ మంగళవారం కీలక ప్రకటన జారీ చేసింది. కాంగ్రెస్ నేతలు, పార్టీపై విమర్శలు వద్దంటూ ఆదేశించింది. టికెట్ల కేటాయింపుపై సంప్రదింపులు జరుగుతున్నాయని పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడొద్దంటూ ఆదేశాలిచ్చింది. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని అధిష్టానం ఆదేశించింది. పార్టీ నేతలంతా సమన్వయంతో ఉండాలని లేకుంటే వేటు తప్పదంటూ హెచ్చరించింది. అయితే, అధిష్టానం ఆదేశాలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. సైలెంట్ అవుతారా..? లేదా..? అనేది వేచిచూడాల్సి ఉంది. పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ అంతర్గత కుమ్ములాటలు పెద్ద తలనొప్పిగా మారాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటుండగా ఈ క్రమంలోనే విహెచ్ కామెంట్స్ పార్టీలో మరింత కాకరేపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News