Wednesday, February 26, 2025

‘చే’జారుతున్న శశిథరూర్

- Advertisement -
- Advertisement -

పార్టీకి గల మద్దతుతోపా సొంతంగా ప్రజలలో గల ఇమేజ్‌ను ఆసరా చేసుకొని వరుసగా నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికైన మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ ఇప్పుడు పార్టీలో ‘సుప్రీం నేత’గా వెలుగొందుతున్న రాహుల్ గాంధీపై తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తున్నారు. వరుసగా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలలో ఘోర పరాజయాలు మూటగట్టుకున్న తర్వాత ‘ఇండియా’ కూటమిలోని భాగస్వామ్య పార్టీలు అన్ని దూరం అవుతున్న సమయంలో శశిథరూర్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ శ్రేణులను కలవరం పరుస్తున్నది. 2019లో పార్టీ పరాజయం తర్వాత, 2020లో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు, పలువురు ఎంపిలు, మాజీ కేంద్ర మంత్రులతో కలిసి 23 మంది పార్టీ అధినేత్రికి రాసిన లేఖలో సైతం తిరుగుబాటు ధోరణి ప్రదర్శించారు.

అయితే, వారెవ్వరూ ప్రజలలో చెప్పుకోదగిన పలుకుబడి కలిగినవారు కాకపోవడంతో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ శశిథరూర్ తిరుగుబాటును ఆ విధంగా కొట్టిపారవేయలేము. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్, 2022లో జరిగిన ఎన్నికల్లో గాంధీ కుటుంబం బలపరిచిన మల్లికార్జున్ ఖర్గేపై పోటీ చేసి మొత్తం 5000 మంది ఓటర్లలో 1500కు పైగా ఓట్లు సంపాదించడం పార్టీలో విస్తృత ప్రతిపాదికలో థరూర్‌కు గల మద్దతును తెలుపుతున్నది. నిజంగా ఆ నాడు థరూర్‌ను పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకొని ఉంటే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బలమైన ప్రాతిపదికను ఏర్పరచుకొని ఉండేదని పలువురు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ను కలిసేందుకు ప్రధాని మోడీ ప్రత్యేకంగా అమెరికాకు వెళ్లిన సందర్భంలో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తే, శశిథరూర్ మాత్రం ఫలవంతమైన పర్యటన అని పొగడ్తలతో ముంచెత్తారు.

అక్రమ వలసదారులు అమానుష రీతిలో పంపడాన్ని మోడీ ప్రస్తావిస్తే బాగుండెడిది అని చురకలు అంటిస్తూనే టారిఫ్‌ల విషయంలో వెంటనే ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకోకుండా చర్చల పేరుతో వాయిదా వేయగలిగారని కొనియాడారు. అంతకు ముందు కేరళలోని ప్రస్తుత లెఫ్ట్ ప్రభుత్వ హయాంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు లభిస్తున్న ప్రోత్సాహకాలను ఒక వ్యాసంలో అభినందించారు. ఈ విషయంగా తమ రాజకీయ ప్రత్యర్థులను థరూర్ పొగడ్తలతో ముంచెత్తడం సహజంగానే కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం కలిగించింది. విదేశీ పర్యటనలో ఉన్న థరూర్ తో వెంటనే మాట్లాడాలని స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఫిబ్రవరి 18న రాహుల్‌ను కలిసిన థరూర్ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో తన పాత్ర ఏమిటో ముందు స్పష్టం చేయమని రాహుల్ గాంధీని నిలదీశారు. పార్లమెంట్ చర్చలలో పార్టీ ప్రతినిధిగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, పార్టీలో సైతం తనకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఏ కమిటీలో తనకు అవకాశం ఇవ్వడం లేదని నిలదీశారు. ఈ విషయాలపై ఎటువంటి సమాధానం ఇవ్వలేక రాహుల్ గాంధీ మౌనం వహించినట్లు తెలుస్తున్నది. అంతేకాదు, తాను ఇప్పటికీ పార్టీకి అందుబాటులోనే ఉన్నానని చెబుతూనే తన అవసరం లేదని పార్టీ భావిస్తే తనకూ వేరే ఆప్షన్లు ఉన్నాయని ఆ తర్వాత స్పష్టంగా హెచ్చరించారు.

వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పార్టీకి సాంప్రదాయకంగా లభించే ఓట్లు మాత్రమే కాకుండా, కాంగ్రెస్ వ్యతిరేక ఓటర్లను సైతం ఆకర్షించగల సత్తా శశిథరూర్‌కు ఉంది. కేరళలో సొంతంగా ఇమేజ్ గల ఏకైక కాంగ్రెస్ నేత ఆయనే అని చెప్పవచ్చు. నాలుగు దశాబ్దాల కేరళ చరిత్రలో తొలిసారి అధికార పార్టీ గెలుపొందిన ఘనతతో పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సిపిఎం నేత పి విజయన్‌కు వచ్చే ఏడాది ఎన్నికలు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. అటువంటి సమయంలో శశిథరూర్ పార్టీపై తిరుగుబాటు చేసి, బయటకు వస్తే అధికారంలోకి వస్తామని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్‌కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.

తనకు వేరే ఆప్షన్లు ఉన్నాయని శశిథరూర్ చెప్పడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
మరో వంక తొలిసారి గత ఏడాది కేరళలో ఒక లోక్‌సభ స్థానం గెల్చుకున్న బిజెపి ప్రజాదరణ గల నాయకుడి కోసం అన్వేషిస్తున్నది. శశిథరూర్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ప్రధాని మోడీకి సన్నిహితులైన కొందరు కలిసి, ఈ విషయమై చర్చలు జరిపారని తెలుస్తున్నది. మరో వంక హోం మంత్రి అమిత్ షా సైతం ఆయనతో సంప్రదింపులతో ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో శశిథరూర్‌ను ఓ ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయమని కూడా కొందరు ఒత్తిడి చేస్తున్నారు.

ప్రస్తుతం ‘ఇండియా’ కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ను నెట్టివేసి ప్రయత్నంలో ఉన్నందున ఆయనను కలుపుకొని అవకాశం ఉంది. ఆయనకు ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో, విద్యావంతులలో మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. వామపక్ష కూటమి సైతం ఆయనతో పొత్తుకు సిద్ధం కావచ్చు. ఏదిఏమైనా ఈ విషయంలో శశి థరూర్ ఆలోచనలు, ప్రాధాన్యతలు వెల్లడి కావాల్సి ఉంది. ఆయన తిరుగుబాటు జరిపితే కేరళలో కాంగ్రెస్ కూటమికి కోలుకోలేని దెబ్బతీసే అవకాశం ఉంది. శశిథరూర్ ప్రభావం కేవలం కేరళకు మాత్రమే పరిమితం కాకపోవచ్చు. మొత్తం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సవాల్ చేసే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

ఇతర రాష్ట్రాల్లో సైతం పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనతో చేతులు కలిపే అవకాశం ఉంది.
కేరళలో కాంగ్రెస్ శిథిలావస్థలో ఉందంటూ ఆయన తన అభిప్రాయాలను మొహమాటం లేకుండా చెబుతున్నారు. ‘కేరళ కాంగ్రెస్‌లో నాయకత్వ శూన్యత ఉంది. ఈ విషయమై నా అభిప్రాయాలను పార్టీ ఇతర నేతలూ సమర్థించారు. కొత్త ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ తన బేస్‌ను విస్తరించాల్సిన అవసరముంది. రాష్ట్ర నాయకత్వం రేసులో నేను అందరికంటే ముందున్నాను. కొన్ని సంస్థల పోల్‌లో ఈ విషయం స్పష్టమైంది. కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని విస్తరించకపోతే వచ్చే ఎన్నికల్లో మూడోసారి ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుంద’ని ఆయన హెచ్చరించారు.

ప్రధాని అమెరికా పర్యటనపై ప్రశంసలు కురిపించిన సమయంలో కేవలం తన అభిప్రాయం చెప్పానని, కాంగ్రెస్ అభిప్రాయం చెప్పేందుకు తానేమీ ఆ పార్టీకి ‘అధికార ప్రతినిధి’ని కాదని అంటూ పార్టీలో తనకు ఎటువంటి పాత్ర లేదనే విషయమై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. పైగా, పార్టీలకు అతీతంగా మాట్లాడటం తనకు అలవాటే అని చెప్పుకొచ్చారు. తాను 16 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రభుత్వంలో తమ పార్టీ ప్రభుత్వం ఉన్నా, ఇతర పార్టీ ప్రభుత్వం ఉన్నా మంచి పనులు చేస్తే ప్రశంసించడం, తప్పు చేస్తే నిలదీయడం తన నైజమని చెప్పారు.

తనలో ఏర్పడిన అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధంగా లేకపోవడంతో 2026లో జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందే ఆయన పార్టీకి దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఆయన దారెటు అనే ఆసక్తి కేవలం కాంగ్రెస్ వ్యతిరేక వర్గాలలోని కాకుండా కాంగ్రెస్‌లో అసహనంతో మగ్గుతున్న అనేకమంది నేతలలో సైతం కలుగుతుంది. సోనియా గాంధీ మాదిరిగా అందరి అభిప్రాయాలు సహనంతో స్వీకరిస్తూ, తన అభిప్రాయాన్ని సున్నితంగా వారిపై రుద్దే ప్రయత్నం రాహుల్ గాంధీ చేయడం లేదు.

ప్రజలలో ఏమాత్రం సంబంధం లేని బృందం ఆయన చుట్టూ చేరి, వారే పార్టీలో అన్ని కీలక నిర్ణయాలు తీసుకొంటూ ఉండడంతో సుదీర్ఘకాలం పార్టీకోసం పనిచేస్తున్న అనేకమందిలో అసహనం వ్యక్తం అవుతుంది. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ సైతం అనేకమంది సీనియర్ నాయకులకు అందుబాటులో ఉండటం లేదు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా రాహుల్ బృందం చేపట్టిన అభ్యర్థుల ఎంపిక హర్యానాలో పార్టీకి ఘోర పరాజయం తీసుకురాగా, మహారాష్ట్రలో సైతం అదే విధంగా వ్యవహరించారు. ఢిల్లీలో ఆప్ లేకుండా ఎన్నికలకు వెళ్లడం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సైతం ఇష్టం లేదు.

కానీ ఆప్‌ను దూరంగా పెట్టడమే కాకుండా, ఆ పార్టీని నాశనం చేయడమే లక్ష్యం అన్నట్లుగా ప్రచారం కొనసాగించడం, పరోక్షంగా బిజెపి గెలుపుకు సహకరించడంను అనేకమంది కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవంక, ప్రజలలో తనకు లభిస్తున్న మద్దతుకు ప్రధాన కారణం జాతీయ, ప్రాంతీయ అంశాలపై స్వతంత్రంగా అభిప్రాయాలను వ్యక్తం చేసే తన ధోరణులని శశిథరూర్ స్పష్టం చేస్తున్నారు. అందుకనే ప్రజలు తనను వరుసగా నాలుగు సార్లు ఎన్నుకున్నారని పేర్కొంటూ కాంగ్రెస్‌ను వ్యతిరేకించే వారు సైతం అనేకమంది తనకు ఓటు వేస్తూ ఉంటారని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే తన సంప్రదాయ ఓటర్లను మించి ఓట్లు పొందాలని, అటువంటి ప్రయత్నం జరగడం లేదని చెబుతూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు నికరంగా 19 శాతం ఓట్లు ఉన్నాయని, మరో 27 శాతం వరకు అదనంగా ఓట్లు పొందనిదే అధికారంలోకి ఏ విధంగా వస్తామని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వం ఆ దిశలో ఆలోచనలు చేయడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో అనేకమంది తన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారని, ‘ఇండియా’ కూటమిలోని కాంగ్రెస్ పక్షాల నాయకులు సైతం ఒప్పుకుంటున్నారని చెబుతూ కాంగ్రెస్ నాయకత్వమే వాస్తవాలు గ్రహించలేక పోతున్నారని చురకలు అంటించారు.

రాజకీయాలలోకి రాకముందే ఐక్యరాజ్యసమితిలో కీలక పదవిలో ఉంటూ అంతర్జాతీయ వ్యవహారాలపై సాధికారికత సంపాదించారు. జాతీయ వ్యవహారాలపై సైతం సాధికారికతతో మాట్లాడగలరు. ప్రజల మద్దతుతో పాటు, సునిశితమైన మేధస్సు గల ఆ విధమైన నాయకులు బహుశా ప్రస్తుతం బిజెపిలో సైతం లేరని చెప్పవచ్చు. అటువంటి శశిథరూర్ పట్ల కాంగ్రెస్ నాయకత్వం సర్దుబాటు ధోరణి ప్రదర్శించని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు.

–  చలసాని నరేంద్ర

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News