Thursday, January 23, 2025

అఫ్తాబ్ నన్ను నరికి చంపుతాడు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : శ్రద్ధావాకర్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రద్ధా వాకర్ తన ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాపై 2020 నవంబర్ 23న మహారాష్ట్ర లోని వసాయ్ లోని తిలుంజ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అతను తనను దారుణంగా కొడుతున్నాడని, చంపి ముక్కలుగా చేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసిందని అధికారులు చెప్పారు. అఫ్తాబ్ హింసాత్మక ప్రవర్తన గురించి అతని కుటుంబానికి కూడా తెలుసని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. “ ఈ రోజు నన్ను ఊపిరాడకుండా చేసి చంపడానికి ప్రయత్నించాడు. నన్ను చంపి ముక్కలుగా నరికి దూరంగా విసిరేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. అతను నన్ను కొట్టి ఆర్నెలలు అయింది. కానీ నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. కాబట్టి పోలీసులను ఆశ్రయించే ధైర్యం నాకు లేదు. నన్ను చంపడానికి ప్రయత్నించినట్టు అతని తల్లిదండ్రులకు కూడా తెలుసు.

అలాగే మేం కలిసి ఉంటున్నట్టు కూడా అతడి తల్లిదండ్రులకు తెలుసు. ఎప్పటికైనా మేం పెళ్లి చేసుకోవలసిందే. మాకు అతడి తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా ఉంది. కానీ నేను ఇప్పుడు అఫ్తాబ్‌తో కలిసి జీవించేందుకు ఇష్టపడటం లేదు. నేను ఎప్పుడైనా తనకంట పడ్డా నన్ను హింసించి, చంపేసే ప్రయత్నం చేయవచ్చు. లేదా బ్లాక్‌మెయిల్ చేసే అవకాశం ఉన్నందున నేను ఏ విధంగా నైనా దారుణంగా గాయపడినట్లయితే దానికి కారణం అఫ్తాబే ” అని శ్రద్ధా తన లేఖలో పేర్కొంది. అయితే ఆ తర్వాత అతని తల్లిదండ్రులు కలగజేసుకుని మాట్లాడటంతో ఆమె “ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు ” అని లిఖిత పూర్వకంగా స్టేట్‌మెంట్ ఇచ్చి, ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోరిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అఫ్తాబ్ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉన్నారు. వారి నుంచి కూడా పోలీసులు స్టేట్‌మెంట్లు తీసుకుంటున్నారు.

అయితే శ్రద్ధా అఫ్తాబ్‌పై ఫిర్యాదు చేసిన సమయంలో తన సహోద్యోగుల్లో ఒకరైన కరణ్‌తో ఆమె ఈ దాడి గురించి చెబుతూ గాయపడిన ఫోటోను వాట్సాప్‌లో షేర్ చేసిన దానితో సరిగ్గా ఈ మేటర్ లింక్ అవుతోందని పోలీసులు చెప్పారు. ఇదివరకు ఆమె మొహంపై గాయాలతో ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. తీవ్ర వెన్ను గాయాలు కావడంతో అప్పుడు ఆమె ఆస్పత్రిలో కూడా చేరిందని ఆ స్నేహితుడు వెల్లడించాడు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే .. ఆమెపై ఆరునెలలుగా దాడి చేసి, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసినప్పుడు .. ఆమె అతడితో ఎంతకాలం వేరుగా ఉంది అనే దానిపై స్పష్టత లేదని పోలీస్‌లు పేర్కొన్నారు. అయితే విచారణలో ఆ జంట ఢిల్లీ వెళ్లడానికి ముందు ఈ ఏడాది ప్రారంభంలో సెలవులకు హిమాచల్ ప్రదేశ్ వెళ్లినట్టు పోలీసులు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News