Monday, January 20, 2025

బోధనకే నిర్వచనం.. శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు

- Advertisement -
- Advertisement -
సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్

హైదరాబాద్ : బోధనకే జీవితాన్ని అంకితం చేసి రెండు తరాల విద్యార్థులను తీర్చిదిద్దిన మహోపాధ్యాయుడు శ్రీరామకవచం వెంకటేశ్వర్లు అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. బోధనకు, సాధనకు, నిబద్ధతతకు, నిమగ్నతకు నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచిన రామకవచం బోధనకే నిర్వచనమయ్యారన్నారు. మన కాలంలో మనం చూసిన మహా బోధకుడిగా కవచం సార్ నిలిచిపోతారన్నారు. కోదాడలోని మేళ్లచెరువు లో శుక్రవారం కేఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ తెలుగు అధ్యాపకులు శ్రీరామకవచం వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులు, పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆయన 90 ఏళ్ల నవతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పూర్వ విద్యార్థిగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆయనకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ, బోధనకే జీవితాన్ని అంకితం చేసి బోధించడమే జీవితంగా నిలిచిన అరుదైన వ్యక్తి శ్రీరామకవచం వెంకటేశ్వర్లు అని తెలిపారు.

తెలుగు సార్ అంటే గుర్తొచ్చే పేరుగా కొన్ని లక్షల మంది విద్యార్థులకు బోధన చేసిన కవచం జీవితం ధన్యమైనదని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేళ్ల మీద లెక్కించే తెలుగు అధ్యాపకులలో శ్రీరామకవచం సార్ ఒకరని తెలిపారు. కళాశాలలో శ్రీరామకవచం బోధన ఆయన తెలుగుపద్యం చదివే తీరు విద్యార్థుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. శ్రీరామకవచం లాంటి బోధకులు తెలుగు భాష సౌందర్యాన్ని, గొప్పతనాన్ని భావితరాలకు అందించే మహామహోపాధ్యాయుడని పేర్కొన్నారు.

శ్రీరామకవచం ఉత్తమ ఉపాధ్యాయుడే కాక కాళీయమర్దనం, నీలకంఠీయం, ఆత్మవేదన, శ్రీపదార్చన, లోకాలోకనము, సౌమనస్యం, శ్రీమట్టపల్లి లక్ష్మీనృసింహ స్తుతి లాంటి కావ్యాలను తెలుగు సమాజానికి అందించారని ఆయన కొనియాడారు. కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు, బీఆరెస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు, ప్రముఖ విద్యావేత్త, కాంగ్రెసు నాయకుడు పందిరి నాగిరెడ్డి, ప్రముఖ వైద్యులు డా. జాస్తి సుబ్బారావు, కోదాడ మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్యబాబు పూర్వ విద్యార్థులు రాఘవరెడ్డి, డి.ఎన్.స్వామి. కే.వి.యల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News