Friday, January 10, 2025

మార్కెట్ సునామీకి వనామీ విలవిల

- Advertisement -
- Advertisement -

దేశంలో దాదాపు రెండు లక్షల 70 వేల ఎకరాల్లో వనామీ రకం రొయ్యల సాగు జరుగుతోంది. దీనిలో లక్షా 80 వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. టైగర్ రొయ్యల రకం మరొక లక్షా 50 వేల ఎకరాల్లో జరుగుతోంది. ఇది ప్రధానంగా లక్షా పాతిక వేల ఎకరాలు ఒక్క పశ్చిమ బెంగాల్లోనే జరుగుతోంది. ప్రస్తుతం తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని వనామీ రైతులు వాపోతున్నారు. వివిధ కారణాలతో ప్రపంచంలో రొయ్యల ఎగుమతి మార్కెట్ అవకాశాలు తగ్గాయి. ఒక వైపు మేత ధరలు విపరీతంగా పెరగటం మరొక వైపు కొనే వారు లేక చేతికి వచ్చిన వాటిని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి. రానున్న కొద్ది నెలలు కూడా ఇలాగే కొనసాగితే ఈ రంగం మొత్తం తీవ్ర సంక్షోభంలో పడనుంది.

ఒక అంచనా ప్రకారం ఇప్పటికే రూ. 5 వేల కోట్ల మేరకు నష్టపోయినట్లు అంచనా. రొయ్యలను శుద్ధి చేసి ఎగుమతికి అనువుగా తయారు చేసే ఫ్యాక్టరీలలో చిన్న, మధ్య తరగతివి మూసివేతకు దగ్గరగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎగుమతులు లేవనే పేరుతో కొందరు రైతులకు చెల్లించాల్సిన సొమ్మును సకాలంలో ముట్టచెప్పటం లేదు. అమెరికా, ఐరోపా, జపాన్ దేశాలలో క్రిస్మస్ సందర్భంగా పలు ఉత్పత్తులకు డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం తలెత్తిన ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా ఈ ఏడాది దానికి తగిన విధంగా మన దేశం నుంచి దిగుమతి ఆర్డర్లు లేవు. చైనాలో కరోనా కేసులను సున్నాకు తగ్గించాలని అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్లు, ఇతర ఆంక్షలను విధించిన కారణంగా అక్కడి డిమాండ్ కూడా తగ్గినట్లు వార్తలు. ఆగస్టు నెల నుంచి ఎగుమతి డిమాండ్ తగ్గిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రొయ్యల మార్కెట్ సంక్షోభం మొదలైంది.

విదేశాల్లో డిమాండ్ తగ్గటంతో ధరలు కూడా పడిపోయాయి. 2021 22లో మన దేశం నుంచి 7.76 బిలియన్ డాలర్ల మేర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జరగ్గా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది లక్ష్యంగా 8.6 బి.డాలర్లను నిర్ణయించింది. అది నెరవేరే పరిస్థితి కనిపించటం లేదు. గిరాకీ తగ్గుదల 30 నుంచి 35 శాతం వరకు, ధరల పతనం 20 నుంచి 25 శాతం ఉన్నందున జనవరి తరువాత తిరిగి పూర్వపు స్థాయికి చేరితే తప్ప అటు కేంద్ర ప్రభుత్వానికి విదేశీ మారకద్రవ్యం తగ్గుదల, ఇటు రైతాంగానికి ఆర్థిక నష్టం జరుగుతుంది. ఎగుమతి, దిగుమతి దేశాలన్నింటా శీతల గిడ్డంగులన్నీ ఆక్వా ఉత్పత్తులతో నిండి ఉన్నట్లు వార్తలు. ఈ కారణంగానే కొనుగోళ్లు మందగింపు, పరిస్థితి మెరుగుపడకపోదా అనే ఆశ ఉన్న ఎగుమతిదార్లు రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. మెరుగుపడితే మంచి లాభాలు లేకపోతే నష్టం ఉండదు అన్న అంచనాలే దీనికి కారణం. గతంలో కూడా మార్కెట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తినా ఇలాంటి తీవ్రత గడచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేదని ఆ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు.

ధనిక దేశాల్లో తలెత్తిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణంగా జేబులకు చిల్లుపడుతున్నందున జనం తమ అలవాట్లు, అవసరాల ప్రాధాన్యతలను కూడా మార్చుకుంటారు. అత్యవసరమైన వాటినే కొనుగోలు చేస్తారు. ఈ పరిస్థితికి తోడు గతేడాది ప్రపంచంలో 40 లక్షల టన్నుల మేర రొయ్యల ఉత్పత్తి జరిగితే ఈ ఏడాది 50 లక్షల టన్నుల వరకు ఉండవచ్చని అంచనా. ఇది కూడా ధరల పతనానికి ఒక కారణం అంటున్నారు. ఈక్వెడార్, ఇండోనేషియా, వియత్నాంలో ఉత్పత్తి పెరిగింది. పన్నెండు లక్షల టన్నులతో ఈక్వెడార్ ఇప్పుడు ప్రపంచంలో అగ్ర దేశంగా ఎదిగింది. చమురు ధరల పెరుగుదలతో రవాణా ఖర్చు పెరిగింది. మన దేశం నుంచి అమెరికా, తరువాత స్థానాల్లో చైనా ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాయి. రవాణా ఖర్చుల పెరుగుదల కారణంగా పక్కనే ఉన్న ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకోవటం అమెరికాలోని దిగుమతి కంపెనీలకు ఎక్కువ లాభం కనుక అక్కడి ఉత్పత్తులకు మొగ్గు చూపుతున్నారు.

చైనా కూడా అక్కడి నుంచి కొంత దిగుమతి చేసుకుంటున్నది. మన కరెన్సీ విలువ తగ్గినందున ఎగుమతిదార్లకు పెరిగిన రవాణా ఖర్చు కలసి వచ్చి కొనుగోలు చేస్తారని భావిస్తే అమెరికా మినహా మిగిలిన దిగుమతి చేసుకొనే దేశాల కరెన్సీ విలువలు కూడా మన రూపాయి మాదిరి పతనమై ఆ దేశాలలో కొనుగోలు శక్తి తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో కిలోకు వంద తూగే వనామీ రకం రొయ్యలకు కనీసం రూ. 240 చెల్లించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది, ఎవరూ కొనుగోలుకు ముందుకు రాకపోవటంతో దాన్ని రూ. 210కి తగ్గించినా చిత్తశుద్ధితో అమలు జరిపేవారు లేరు. నిల్వ ఉండే సరకు కానందున చివరకు రూ. 180, ఇంకా అంతకు తక్కువకు సైతం అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఉత్పత్తి ఖర్చులు కూడా రాక ఆర్థికంగా నష్టపోతున్నారు. చివరకు టైగర్ రకం ధర కూడా రూ. 600 నుంచి రూ. 450కి పడిపోయింది. ఈ కారణంగా గతేడాది జరిగిన 9.2 లక్షల టన్నుల ఉత్పత్తి ఈ ఏడాది ఎనిమిది లేదా ఇంకా తక్కువకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర దేశాల రైతులకు సైతం ఎగుమతి అవరోధాలు ఉన్నప్పటికీ మలేషియా, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాల్లో వంద కౌంట్ ఉన్న వాటికి రూ. 290 నుంచి 310 వరకు రైతుకు వస్తుండగా మన దగ్గర రెండు వందల కంటే తక్కువకు దిగజారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలోకు రూ. 300లకు తగ్గితే గిట్టుబాటు కాదని, 270 కంటే తగ్గితే నష్టమని అంటున్నారు.

మన దేశం 123 దేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. వీటిలో ఎక్కువ భాగం రొయ్యలే ఉండటంతో గతేడాది జరిగిన మొత్తం ఆరు లక్షల టన్నుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 60 శాతం వరకు ఉంది. చైనా తన దిగుమతుల్లో 70 శాతం మన దేశం నుంచి చేసుకొనేది. ఇప్పుడు ఈక్వెడార్ నుంచి కూడా చేసుకుంటున్నది. వివిధ దేశాలు చేసుకొనే దిగుమతులపై వర్తమాన రాజకీయాలు, వాణిజ్య సంబంధాలు కూడా ప్రభావం చూపుతాయి. తమకు వ్యతిరేకంగా పని చేస్తున్న అమెరికాతో భారత్ చేతులు కలుపుతోందన్న అభిప్రాయం చైనాకు ఉంది. మరో వైపున మన దేశంలో బిజెపి, దానికి మార్గదర్శకంగా పనిచేసే సంఘ పరివార్ సంస్థల దళాలు, వారికి వంతపాడే మీడియా విశ్లేషకులు సుప్రభాతం మాదిరి రోజు చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని దానికి బుద్ధి చెప్పాలని, మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని ప్రచారం చేస్తుంటారు.

ఈ నోటి దూలను చూసిన తరువాత మన ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ఎగుమతి చేసే దేశాలున్నపుడు వాటి నుంచి దిగుమతుల చేసుకోవాలనే అలోచన కలగవచ్చు. లేకపోతే ఎంతో దూరంలో ఉన్న ఈక్వెడార్ నుంచి చైనా దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినట్లు? వాటికి ప్రతిగా చైనాకు తన వస్తువులను అక్కడికి ఎగుమతి చేసేందుకు అవకాశాలు పెరుగుతాయి. మన ప్రభుత్వం విధిస్తున్న ఎగుమతి పన్నులు, మన దేశంతో ఒప్పందాలు లేని కారణంగా దిగుమతి చేసే దేశాలు మన ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు కూడా దిగుమతిదార్లను అవి లేని దేశాల వైపుకు నెడతాయి. అందువలన ఇలాంటి పన్నులు లేకుండా ఉండాలంటే మన దేశం ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం కూడా అవసరమే. అయితే అలాంటి ఒప్పందాలకు వెళ్లే ముందు మన దేశ లబ్ధిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఐరోపా, ఇతర దేశాలతో వియత్నాం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నందున అవి మనకు బదులు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాయి. మన రొయ్యలపై తెల్లమచ్చల కారణంగా ఆస్ట్రేలియా దిగుమతులను నిలిపివేసింది. అందువలన ఎగుమతి చేసే దేశాలు కోరుకున్న ప్రమాణాల మేరకు వ్యాధులు, నిషేధిత మందుల అవశేషాలు లేకుండా మన ఉత్పత్తులుండటం కూడా అవసరమే.

ఒకవేళ ఇక్కడ కన్ను గప్పి పంపినా ఎక్కడైనా పట్టుబడితే మొదటికే మోసం వస్తుంది. ఇక స్థానిక సమస్యల సంగతులను చూస్తే నాణ్యమైన రొయ్య విత్తన (పిల్లల) లభ్యత కూడా తీవ్రంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సబ్సిడి ఎత్తివేసేందుకు దారులు వెతికి రైతుల్లో ఆందోళన కలిగించింది.ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అని కొన్ని రోజులు, ఐదెకరాల లోపు, ఆపైవారు అని మరికొన్ని రోజులు, సర్వేల పేరుతో చేస్తున్న కాలయాపన గురించి రైతుల్లో అసంతృప్తి ఉంది. ప్రతి గ్రామంలో సచివాలయాలు, వాలంటీర్లు ఉన్నందున ఒక్క రోజులో సమాచారాన్ని సేకరించవచ్చు. మరో వైపు విపరీతంగా పెరుగుతున్న మేత ధరలు అదుపులో ఉండటం లేదు. కనీస మద్దతు ధరను అమలు జరిపే అధికారులు, ఉల్లంఘించిన వారి మీద చర్యలు గానీ ఉండటం లేదు. ఎగుమతి పరిస్థితి మెరుగుపడేంత వరకు పంట విరామం ప్రకటించాలని కూడా కొందరు రైతులు సూచిస్తున్నారు. లక్షలాది మందికి ఆక్వా ఉపాధి కల్పిస్తున్నది. అందువలన ఈ రంగాన్ని కూడా పరిశ్రమగానే గుర్తించి ఇతర పరిశ్రమలకు మాదిరే ఇస్తున్న విద్యుత్, ఇతర రాయితీలను అందరికీ వర్తింప చేయాలని కూడా రైతులు కోరుతున్నారు. సంక్షోభ సమయాల్లో అన్నిరంగాలను ఆదుకున్నట్లుగానే ఆక్వాను కూడా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వారి గోడును పాలకులు వినిపించుకుంటారా? అనుమానమే !

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News