Friday, January 10, 2025

ఎన్విరాన్ మెంటల్ సైన్సులో శ్రుతి దేవులపల్లికి పిహెచ్‌డి డిగ్రీ

- Advertisement -
- Advertisement -
ప్రదానం చేసిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ

హైదరాబాద్: నగరానికి చెందిన శ్రుతి దేవులపల్లికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఎన్విరాన్ మెంటల్ సైన్స్ లో పిహెచ్ డి డిగ్రీని ఆదివారం ప్రదానం చేసింది. ఆమె ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ నొవార్టిస్ లో సీనియర్ అసోసియేట్ గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో కోవిడ్ కు ముందు, కోవిడ్ లాక్ డౌన్ సమయంలోనూ, కోవిడ్ అనంతరం గాలి నాణ్యత అంశంపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ వరించింది. నగర వాతావరణంపై ప్రభావం చూపిస్తున్న వివిధ వాయు కాలుష్య కారకాలపై ఆమె లోతైన పరిశోధన జరిపి, థీసీస్ సమర్పించారు.

సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ పి. మధుసూదనరెడ్డి మార్గదర్శకత్వంలో పరిశోధన జరిపారు. నగరాన్ని ప్రభావితం చేస్తున్న ప్రధాన వాయుకాలుష్య కారకాలపై పరిశోధనకూ, డేటా విశ్లేషణకూ ఆమె ప్రయోగాత్మకమైన పద్ధతిని అనుసరించారు. తన అధ్యయనంలో భాగంగా వాతావరణంలోని కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, అమ్మోనియా, నైట్రోజన్ డయాక్సైడ్, బెంజీన్, ఓజోన్ వంటి రసాయనాలతోపాటు గాలిలో తిరుగాడే ధూళి కణాలపైనా ఆమె సునిశిత అధ్యయనం చేశారు. కోవిడ్ కు ముందు, కోవిడ్ లాక్ డౌన్ సమయం, కోవిడ్ అనంతర వాతావరణ పరిస్థితులపై ఆరు వేర్వేరు ప్రదేశాల్లో అధ్యయనం జరిపి డేటాను సేకరించారు. ఈ పరిశోధన వాతావరణ స్వచ్ఛతపై శ్రుతి నిబద్ధతకు, పర్యావరణ శాస్త్రం పట్ల ఆమెకు గల మక్కువకు నిదర్శనం. పర్యావరణంలో గాలి నాణ్యతను సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సమర్ధవంతమైన విధానాల రూపకల్పనకు శ్రుతి అధ్యయనం ఎంతైనా తోడ్పడుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News