దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన వన్డే తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఐదో ర్యాంక్‌కు ఎగబాకాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన గిల్ తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలను మెరుగు పరుచుకుని టాప్5లో చోటు సంపాదించాడు. ఇంతకు ముందు గిల్ ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో 743 రేటింగ్ పాయింట్లతో ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి టాప్ 10లో చోటు కాపాడుకున్నాడు.
తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్ 9వ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 886 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చాలా రోజులుగా బాబర్ వన్డేల్లో టాప్ ర్యాంక్‌లోనే ఉన్నాడు. ఈసారి కూడా దాన్ని కాపాడుకున్నాడు. ఇక సౌతాఫ్రికా బ్యాటర్ వండర్ డుస్సెన్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఫకర్ జమాన్ (పాకిస్థాన్) మూడో, ఇమాముల్ హక్ (పాకిస్థాన్) నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. బౌలింగ్ విభాగంలో జోస్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. హాజిల్‌వుడ్ 705 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాకే చెందిన మిఛెల్ స్టార్క్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
భారత్ యువ ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. సిరాజ్ 670 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు. మాట్ హెన్రీ (కివీస్) ఐదో ర్యాంక్‌ను సాధించాడు. ఇక విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మెరుగైన బౌలింగ్‌ను కనబరిచిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో బంగ్లాదేశ్ స్టార్ షకిబ్ అల్ హసన్ 371 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.