దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న గిల్ ఈసారి ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకున్నాడు. 743 పాయింట్లతో గిల్ నాలుగో ర్యాంక్‌కు ఎగబాకాడు. టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన తొమ్మిదో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. కాగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 880 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. వండర్ డుస్సెన్ (సౌతాఫ్రికా) రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఇక పాకిస్థాన్ ఆటగాడు ఇమామ్ ఉల్ హక్ ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని మూడో స్థానానికి దూసుకెళ్లాడు. పాక్‌కే చెందని ఫకర్ జమార్ రెండు ర్యాంక్‌లు కిందికి పడిపోయి ఐదో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు.
ఐర్లాండ్ బ్యాటర్ హారి టెక్టర్ ఆరో, డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) ఏడో, క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా) 8వ, స్టీవ్ స్మిత్ పదో ర్యాంక్‌లో నిలిచారు. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోస్ హాజిల్‌వుడ్ 705 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాకే చెందిన మిఛెల్ స్టార్క్ రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. కాగా, అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ ముజీబుర్ రహ్మార్ మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న ముజీబుర్ రహ్మాన్ ఏకంగా మూడు ర్యాంక్‌లను మెరుగు పరుచుకోవడం విశేషం. భారత స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ ఒక స్థానం కోల్పోయి ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. టీమ్ విభాగంలో ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్‌లో నిలిచింది. పాకిస్థాన్ రెండో, టీమిండియా మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాయి.