శ్యామ్ బెనెగల్ స్త్రీ హృదయం క్షుణ్ణంగా తెలిసినవాడు. ఆయన ప్రతి సినిమాలో మనకు స్పష్టంగా కనిపించేది ఆయన స్త్రీ పాత్రలు చాలా బలమైనవి, స్వతంత్రమైనవీ. ‘అంకుర్’, ‘నిశాంత్’ లలో స్త్రీలు భూస్వామ్య పురుషాధిపత్యాన్ని ధిక్కరిస్తే ‘భూమిక’లో నగర నేపథ్యంలో పురుషాధిపత్యం పట్ల ధిక్కారం ఉంటుంది. ‘భూమిక’ ఒక మరాఠీ నటి ‘హంస వాడ్కర్’ జీవితం మీద ఆధారపడిన కథ. పురుషాహంకారాన్ని, ఆధిపత్యాన్ని, కుటుంబ నియమాల్ని, ధిక్కరించి తన అస్తిత్వం కోసం, ఉనికి కోసం, జీవితం కోసం తిరగబడి నిలిచి పోరాడిన ఒక నటి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. స్మితా పాటిల్ శక్తివంతమైన నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది.
అనంత నాగ్, నసీరుద్దీన్ షా ఈ సినిమాలో పురుష పాత్రలకు ప్రాణం పోశారు. ఏ పాత్ర అయినా దానికి తాను ఎంచుకున్న నటులెవరైనా, వారి నుండి పూర్తి సహకారాన్ని, అనుభూతుల్ని, అనుభవాల్ని రాబట్టడంలో శ్యామ్ బెనెగల్ తనకు తానే సాటి. 1983లో తీసిన ‘మండి’ ఒక వేశ్యాగృహం నేపథ్యంలో ఆధిపత్య రాజకీయాలను, సంబంధాలను, నైతికతలను హాస్యం జోడిస్తూ అద్భుతంగా పరిశీలిస్తుంది. షబానా ఆజ్మి ఈ సినిమాలో వేశ్యాగృహం అధిపతిగా కనబడడం ఒక గొప్ప సన్నివేశం. నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మి, స్మితా పాటిల్, రఘువీర్ యాదవ్, నీనా గుప్తా లాంటి గొప్ప నటీనటుల్ని పరిచయం చేసిన ఘనత శ్యామ్ బెనెగల్ దే ! ప్రఖ్యాత నాటక ప్రయోక్త హబీబ్ తన్వీర్ ‘చరణ్ దాస్ చోర్’ నాటకానికి సినిమా రూపమిచ్చి, అందులో స్మితా పాటిల్‌ని పరిచయం చేసిన ఘనత కూడా శ్యామ్ బెనెగల్ దే!
2001లో శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించిన సినిమా జుబేదా చెప్పుకోదగ్గ మరో గొప్ప సినిమా. ప్రధాన స్రవంతి నటీనటులతో నటింపజేస్తూ (శశికపూర్ రేఖలతో ‘కలియుగ్’ సినిమా తీసినా), తన సినిమాల్లో ఎట్లా స్త్రీలు భూస్వామ్య, మత, కుల ఆధిపత్యాలకూ పురుషాహంకార ధోరణికి బలవుతున్నదీ విశదీకరిస్తారు. శ్యామ్ బెనెగల్ దర్శకత్వ ప్రతిభ అద్భుతంగా ఆవిష్కరించే మరో సినిమా ‘కలియుగ్’. ఆధునిక మహాభారతాన్ని ‘కలియుగ్’ సినిమాలో గొప్పగా ఆవిష్కరించారు. భిన్న వైరుధ్యాలను, పాత్రల అంతరంగ స్వభావాలను నిశితంగా పరిశీలించిన సినిమా ‘కలియుగ్’. అట్లే 1961 దాకా పోర్చుగీస్ పాలనలో ఉండిన గోవా ప్రత్యేక పరిస్థితులను గొప్పగా చిత్రించిన సినిమా ‘త్రికాల్’. ఈ సినిమాలో నీనా గుప్తా ఒక గొప్ప నటిగా ఆవిష్కరించబడింది.
పై సినిమాలన్నీ ఒక ఎత్తైతే శ్యామ్ బెనెగల్ దూరదర్శన్ కోసం తీసిన సీరియల్ ‘భారత్ ఏ ఖోజ్’ మరొక ఎత్తు. జవహర్ లాల్ నెహ్రూ రచించిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ ను దూరదర్శన్ కోసం సీరియల్‌గా నిర్మించారు శ్యామ్. అది మామూలు విషయం కాదు. భారత చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేయడమేకాక దాన్ని నెహ్రూ రచనలోంచి దృశ్యమానం చేయడం చాల కష్టసాధ్యమైంది. నెహ్రూ మహత్తర రచనను 53 ఎపిసోడ్ లా ని ర్మించి ఆ రచనకు పూర్తి న్యాయం చేసిన ఘనత శ్యామ్ బెనెగల్‌ది. అందులో శివాజీ పాత్రకు ముస్లిం అయిన నసీరుద్దీన్ షా ని ఎన్నుకోవడం శ్యామ్ బెనెగల్ చేసిన గొప్ప సాహసం అని చెప్పుకోవచ్చు. అందుకు నసీరుద్దీన్ షా తన అద్భుతమై న నటనతో పూర్తి న్యాయం చేయడం భారత చలనచిత్ర చరిత్రలోనే ఒక అపురూపమైన విషయం.
హైదరాబాద్ అల్వాల్‌లో పుట్టి పెరిగిన శ్యామ్ బెనెగల్ జీవితాంతం తన వేర్లని మర్చిపోలేదు. తెలంగాణ పల్లెటూళ్ళ సామాజిక జీవితా న్ని మొట్ట మొదటిసారి భారతీయ చలనచిత్ర రంగంలో శక్తివంతంగా చిత్రించారు. తన చుట్టూ ఉన్న సామాజిక సందర్భానికి, తన విస్తృతమైన జ్ఞానాన్ని, నిశితమైన పరిశీలనను, స్పష్టమైన ప్రాపంచిక దృక్పథాన్ని జోడించిన శ్యామ్ బెనెగల్ తన సంపూర్ణ జీవితాన్ని సఫలీకృతమైన సినిమాగా కళాఖండాలుగా మనకు మిగిల్చి వెళ్లిపోయారు.
తెలంగాణ ముద్దుబిడ్డగా, అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో మన పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన శ్యామ్ బెనెగల్ మన జ్ఞాపకాల్లో, సాంస్కృతిక చరిత్రలో సజీవంగా నిలిచిపోతారు.
(గత సంచిక తరువాయి)
నారాయణ స్వామి