సినిమాల్లో స్త్రీ పాత్రలను నిండుగా అర్థవంతంగా రూపొందించడంలో శ్యామ్ బెనగల్‌కు ప్రత్యేకమైన నేర్పుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సగటు ఆడవాళ్ళనే ఆయన సినిమాల్లో చూస్తాం. జండర్ పాలిటిక్స్‌ని చిక్కటి కథనం కింద కనీకనబడకుండా చూపించడంలో బెనగల్ దిట్ట. వర్గ, లింగ వివక్షలను దాటిపోదు శ్యామ్ బెనగల్ నిశిత దృష్టి. అలాగని ఫెమినిస్ట్ స్టేట్మెంట్స్‌తో బాధిత స్త్రీలను ఒడ్డున పడేసే మొరటుపని చెయ్యడాయన. వాళ్ళు జీవితం ఇచ్చిన అవకాశాలనుబట్టి తమకు వీలైన నిర్ణయాలు తీసుకుంటారు. అంకుర్‌లో లక్ష్మి కుమ్మరి కులానికి చెందిన పేద యువతి.
భర్త మూగ, చెవిటివాడు. ఆమె జమీందారు కొడుకు సూర్యానికి లొంగి గర్భవతి అవుతుంది. కడుపుతో ఉన్న తనను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాడతను. పైగా ఆమె భర్తను చావబాదుతాడు. ఆగ్రహ్‌ంతో బద్దలయిన లక్ష్మి ఒక్కసారిగా సూర్యం మీద తిట్లతో విరుచుకుపడుతుంది. ఆమెది తిరుగుబాటు. నిశాంత్‌లో స్కూల్‌టీచర్ భార్య సుశీలను జమీందార్లు ఎత్తుకెళ్ళి గ్యాంగ్‌రేప్ చేస్తారు. ఆమె భర్త పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు. చివరకు ఆ ఇంట్లోనే తనతో కాస్త దయగా ప్రవర్తించిన జమీందార్‌తో ఉండిపోతుందామె. గాయపడ్డ సుశీలది జీవితంతో మగప్రపంచ్‌ంతో రాజీ. స్వతహాగా ధీమాగా ఉండే సుశీల తన తత్వాన్ని చివరివరకూ నిలుపుకుంటుంది. భారంత్‌ంలో ద్రౌపదిని గుర్తుకు తెస్తుంది.
భూమికలో నటి ఉష పెళ్లి చేసుకోవటంలో తప్పటడుగువేసి, తరువాత హింస, అబార్షన్, రేప్, గృహనిర్బంధం లాంటి బాధలన్నీ పడుతుంది. బైటిపని చేసే ఆడవాళ్ళకు స్త్రీవాదం లాంటి ఆసరాలేవీ లేవప్పుడు. బలమైన మగప్రపంచం ఇంటాబయటా భయపెడుతూవుండే రోజులు. సంపాదనతో స్త్రీల వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటున్న రోజులు. భార్యాత్వం, మాతృత్వం మూసలోనే తమను ఇంకా ఇరికించే ఉంచాలని చూసే సంప్రదాయవాదుల మధ్య ఆనాటి స్త్రీలు ఉషలాగే గిలగిల్లాడిపోయి వుంటారు. ఉష కీలుబొమ్మలా ఉండదు. బయట తిరిగే స్వేచ్ఛ, ఉద్వేగంగా ఆమె తీసుకున్న నిర్ణయాలు రోలర్‌కోస్టర్‌లా ఆమెను ఊపేస్తాయి. జీవితం నేర్పిన పాఠాలతో చిన్నపిల్ల దశనుంచి నడివయసు వరకూ ఒక సినిమానటి ఎదిగిన విధానాన్ని శ్యామ్‌బెనెగల్ ఎలాంటి జడ్జ్‌మెంట్ చెయ్యకుండా తెరకెక్కిస్తాడు భూమికలో.
లైంగికత విషయ్‌ంలో స్పష్టత ఉంటుంది శ్యామ్‌బెనగల్ స్త్రీ పాత్రలలో కొన్నిటికి. అంకుర్‌లో లక్ష్మి సూర్యంతో పెట్టుకున్న సంబంధ్‌ంలో పేదరికంనుంచి బయటపడొచ్చుననే ఆశ ఉండొచ్చు. భూమికలో మధ్యతరగతి ఉష హింస పడుతూనే లైంగిక సంబంధాలలో చాయిస్ కూడా వాడుకుంటుంది. అలాంటి చాయిస్ ఉష తల్లికి ఉండదు. ఆమెది మధ్యతరగతి. బతుకుతెరువు కోసం ఒక ధూర్తుడి మీద ఆధారపడుతుంది. స్త్రీపురుష సంబంధాలను లోతుగా చర్చించిన అనుగ్రహ్‌ం సినిమాలో భర్త మూఢనమ్మకానికి అనుగుణంగా తన లైంగికతనూ జీవితాన్నీ బలిపెట్టుకుంటుంది పూజారి భార్య.
మంథన్‌లో బిందు తమకు సాయపడుతున్న వెటర్నరీ డాక్టర్‌తో ఆకర్షణలో పడుతున్నానని గుర్తిస్తూనే కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటుకు గట్టి సాయం చేస్తుంది. మండీలో రుక్మిణీబాయి వేశ్యాగృహం నడుపుతూ తనదగ్గరున్న అమ్మాయిలందరినీ తిడుతూనే బాగా చూసుకుంటుంది. రెక్కలకింద దాచుకుంటుంది. వాళ్ళకి స్వేచ్చనిస్తుంది. సూరజ్‌కా సాత్వాఘోడాలో మధ్యతరగతి జమున, కిందితరగతి సత్తిల ప్రేమ, మమ్మో తెలివి, చురుకుదనం, జుబైదా అందం, తెగింపు, సర్దారీ బేగమ్ పట్టుదల బెనెగల్ సినిమాల్లో స్త్రీల ప్రత్యేకతను ఎత్తిచూపిస్తాయి.
కట్టూబొట్టూ మాటతీరూ మార్చుకుని కథ వాతావరణానికి చెందిన సంస్కృతిలో ఒదిగిపోయేటట్టు తన నటీనటులను తీర్చిదిద్దుకున్నాడాయన. సినిమాలకు శ్యామ్‌బెనగల్ ఎంచుకున్న సాహిత్యం కూడా ఆయన స్త్రీపాత్రలు తమ బలాలూ బలహీనతలతో సహా సప్తవర్ణాల్లో కనిపించడానికి ఒక కారణం. అంకుర్ శాయ్మ్‌బెనగల్ రాసిన కథే. భూమిక హంసావాడ్కర్ జీవితకథ. మమ్మో, సర్దారీబేగం, జుబైదా సినిమాలకు ఖాలిద్ మొహమ్మద్ కథలు ఆధారం. సూరజ్‌కా సాత్వాఘోడా ధరమ్‌వీర్ భారతి నవల. వైవిధ్యభరితమైన స్త్రీపాత్రలతో సినిమాలు తీసిన ఈ గొప్పదర్శకుడికి స్త్రీలపట్ల ఉన్నది నిండైన సహానుభూతి..
ల.లి.త.