Sunday, January 19, 2025

రివాల్వర్‌తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

జనగామ : చెందిన సంఘటన జనగామ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..35 సంవత్సరాల క్రితం జగిత్యాల జిల్లా జమ్మికుంట ప్రాంతానికి చెందిన స్వరూపను గోదావరిఖనికి చెందిన కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. శ్రీనివాస్ కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా ప్రమోషన్ పొంది జనగామలో కొంత కాలం, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కొంత కాలం ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం జనగామ ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనగామ జిల్లా వాస్తవ్యులకు సుపరిచితుడైన మంచి వ్యక్తిత్వం కలిగిన వాడిగా పేరు సంపాదించారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదానికి నిలువుటద్దం అని చెప్పి చాలా మంది కొనియాడేవారు. శ్రీనివాస్ జనగామలోని వెంకన్నకుంటలో గోవిందు లింగయ్య అనే వ్యక్తి ఇంట్లో మొదటి అంతస్తులో కిరాయికి ఉంటున్నాడు. మూడు నెలల క్రితం శ్రీనివాస్ పెద్ద కుమారుడు రవితేజ వివాహం జరిపించారు. రవితేజ హైదరాబాద్‌లోని బేగంపేటలో ఒక ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం ఎస్సై కాసర్ల శ్రీనివాస్ తన భార్య చనిపోయిందంటూ ఏడుస్తుండటంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని చూసే సరికి స్వరూప ఇంటి ఆవరణలో ఉన్న బాత్‌రూమ్‌లోని వెంటిలేటర్‌కు చున్నీతో ఉరివేసుకొని మృతి చెంది ఉంది. భార్య మృతితో కాసర్ల శ్రీనివాస్ రోదనలు మిన్నంటాయి. సమాచారం తెలుసుకున్న ఏసీపీ విచారణ కోసం ఇంటికి చేరుకొని విచారిస్తుండగా బాత్‌రూమ్‌కి వెళ్లి వస్తానని చెప్పి బాత్‌రూమ్‌లోనే తన రివాల్వర్‌తో కాల్చుకున్నాడు.

రక్తపు మడుగులో పడి కాసర్ల శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు మాట్లాడుతూ ఉన్న ఎస్సై చనిపోవడంతో స్థానికులు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. భార్య మృతిని తట్టుకోలేక చనిపోయాడా లేక కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో చనిపోయినట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లో ఉండే పెద్ద కుమారుడు రవితేజకు జాల ప్రశాంత్ అనే తన తల్లి బాత్‌రూమ్‌లో ఉరివేసుకొని చనిపోయినట్లుగా సమాచారాన్ని అందించాడు. వెంటనే రవితేజ, ప్రబంధ దంపతులు జనగామకు బయల్దేరి వచ్చే సరికి తండ్రి కూడా చనిపోయినట్లు గమనించారు. తల్లిదండ్రుల మరణంతో రవితేజ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. బుధవారం రాత్రి అమ్మనాన్న గొడవ పడినట్లుగా తెలిసిందని, ఉదయం పాలు పోసే బండారు లక్ష్మణ్ తలుపు కొట్టగా ఎవరూ స్పందించకపోవడంతో పక్కన ఉండే లక్ష్మీనర్సయ్య సహాయంతో వెనుక డోర్ వైపు వెళ్లి చూడగా అక్కడ బాత్‌రూమ్‌లో ఉరివేసుకొని చనిపోయి ఉన్న స్వరూప కనిపించిందని అన్నారు.

బుధవారం రాత్రి జరిగిన గొడవను మనసులో పెట్టుకొని తల్లి స్వరూప మనస్తాపం చెంది ఉరివేసుకొని చనిపోయినట్లు, అది తట్టుకోలేక తండ్రి కాసర్ల శ్రీనివాస్ కూడా తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని చనిపోయినట్లు రవితేజ పోలీస్ వాంగ్మూలంలో తెలిపాడు. కలివిడిగా ఉండే శ్రీనివాస్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో ప్రజలు చేరుకొని శ్రీనివాస్ దంపతుల మృతదేహాన్ని చూసి నివాళులు అర్పించారు. ఎస్సై శ్రీనివాస్ భార్య ఆత్మహత్య విషయం తెలియగానే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కాసర్ల శ్రీనివాస్‌కి ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని చెప్పారు. అయితే గంట వ్యవధిలోనే ఎస్సై కాసర్ల శ్రీనివాస్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమ్మెల్యే వాపోయారు.

ఎస్సై దంపతులను కడసారి చూడటానికి పోలీస్‌వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీపీ రంగనాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శోభన్‌కుమార్, వారి సంఘం నుంచి దహన సంస్కారాల నిమిత్తం రూ.20వేలు నగదు అందజేశారు. ప్రజల సందర్శనార్థం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేపట్టారు. అనంతరం ర్యాలీగా శ్రీనివాస్ స్వగ్రామమైన గోదావరిఖనికి మృతదేహాలను తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News