Saturday, December 21, 2024

డ్రగ్స్‌లో ఎస్సై చేతివాటం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పట్టుకున్న డ్రగ్స్‌ను కొట్టేసిన ఎస్సైని నార్కొటిక్ విభాగం అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో దాచిన 1,750 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైంలో పనిచేస్తున్న రాజేంద్ర కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో నిర్వహించిన ఆపరేషన్‌లో పాల్గొన్నాడు. అక్కడ దొరికిన డ్రగ్స్‌లో 1,750 గ్రాములు కొట్టేసి ఇంట్లోని లాకర్‌లో దాచుకున్నాడు. దానిని మార్కెట్‌లో విక్రయించేందుకు యత్నించాడు. ఈ విషయం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో(టిఎస్ న్యాబ్) అధికారులకు తెలిసింది. ఈ విషయంపై టిఎస్ న్యాబ్ డైరెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్‌కు నివేదిక ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన న్యాబ్ పోలీసులు రాజేంద్ర ఇంట్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించగా డ్రగ్స్ లభించాయి.

అదుపులోకి తీసుకుని విచారించగా, వాటిని అవసరం ఉన్న వారికి విక్రయించేందుకు తీసినట్లు చెప్పాడు. వెంటనే అదుపులోకి తీసుకుని రాయదుర్గం పోలీసులకు అప్పగించడంతో వారు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై రాజేంద్రపై గతంలో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎస్పైగా పనిచేస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో బైక్ యజమాని నుంచి రూ.20వేలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఇటీవలి కాలంలో ఈ కేసులో వచ్చిన తీర్పులో ఎస్సై రాజేంద్రను సర్వీస్ నుంచి తొలగిస్తూ తీర్పు చెప్పింది. దీనిపై పైకోర్టుకు వెళ్లిన రాజేంద్ర స్టే తెచ్చుకున్నారు. తర్వాత సైబరాబాద్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైం విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News