3 రకాల నేరాలకు పాల్పడినట్లు గుర్తింపు
సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం
ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమానం
మొత్తం 17 కంప్యూటర్ల ద్వారా ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడ్డ వైనం
ప్రణీత్‌రావు నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఓ ల్యాప్‌టాప్ స్వాధీనం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబి) మాజీ డిఎస్‌పి ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నిందితుడు 3 రకాల నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మొత్తం 17 కంప్యూటర్ల ద్వారా ఫోన్ల ట్యాపింగ్ చేసినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 4న పాత హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడం సహా ఏళ్ల తరబడి సీక్రెట్ గా సేకరించిన డేటా మొత్తాన్ని ఎన్నికల ఫలితాల రోజు చెరిపేసినట్లు వెల్లడించారు. కాగా, ఈ కేసు విచారణకు ఉన్నతాధికారులు ఆరుగురి సభ్యులతో టీంను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఎసిపి విచారణాధికారిగా ఉండగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్ ఇన్ స్పెక్టర్, ఎస్‌ఐలు ఉన్నారు. నిందితుడి నుంచి 3 సెల్ ఫోన్లు, ఓ ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.
అయితే, ప్రత్యేక టీం విచారణలో ప్రణీత్ రావు పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ‘అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దలకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశా. ఈ సమాచారాన్ని అప్పటి ఎస్‌పి స్థాయి అధికారుల నుంచి ఎస్‌ఐబి చీఫ్ వరకూ అందరికీ అందజేశాను. కొందరు నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశాను. చాలామంది అధికారులు, ప్రజా ప్రతినిధుల వాట్సాప్ ఛాటింగ్స్ పై నిఘా పెట్టాను. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అధికారులకు ఇచ్చా. అప్పటి ఎస్‌ఐబి మాజీ చీఫ్ ఆదేశాలతో మొత్తం డేటాను ధ్వంసం చేశాను. సెల్ ఫోన్స్, హార్డ్ డిస్కులతో పాటు వేలాదిగా పత్రాలు ధ్వంసం చేశా.’ అని ప్రణీత్ రావు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం చంచల్ గూడ జైలులో 14 రోజుల రిమాండ్ లో ఉన్న ప్రణీత్ రావును మరోసారి విచారించేందుకు ప్రత్యేక అధికారుల బృందం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన్ను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ లో కోరినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు విచారణలో వెల్లడించిన అధికారులను విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
జరిగిందేంటి?
ఎస్‌ఐబిలోని ఎస్వోటీ ఆపరేషన్ హెడ్‌గా ఉన్న సమయంలో డిఎస్‌పి ప్రణీత్ రావు రాజకీయ నాయకులు, ఎన్జీవోలు, పౌర హక్కుల నేతలతో పాటు మావోయిస్టులు, ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఫలితాల రోజు రాత్రి 9 గటల సమయంలో ఆయన లాగర్ రూమ్‌కు వెళ్లి హార్డ్ డిస్క్‌లతో పాటు డాక్యుమెంట్లను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఎస్వోటీ లాగర్ రూమ్ సిసి కెమెరాలను ఆఫ్ చేయించారు. దాంతో ఆయన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఫోన్ల ట్యాప్ చేశారని ఆరోపణలకు పట్టు చిక్కినట్లయింది. లాగర్ రూమ్‌లో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేసి వెళ్లిపోయారు.
తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన కాంగ్రెస్, బిజెపి నేతల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ శాఖ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు పక్కా ఆధారాలు సేకరించి మార్చి 12న రాత్రి సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి రాత్రికి రాత్రే ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు.