Wednesday, January 8, 2025

సికిల్ సెల్ వ్యాధి నుంచి విముక్తి ఎప్పుడు ?

- Advertisement -
- Advertisement -

జన్యుకణ వారసత్వంగా వచ్చే సికిల్ సెల్ వ్యాధితో భారత్‌లో 15 లక్షల మంది బాధపడుతున్నారు. అత్యధికంగా ఈ వ్యాధి విస్తరించిన 17 రాష్ట్రాల్లో 202526 నాటికి ఏడు కోట్ల మంది ఈ వ్యాధిగ్రస్తులకు స్క్రీనింగ్ చేసి వ్యాధి స్థాయిని గుర్తించాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. కానీ 2022 23 నాటికి ఒక కోటి మందికి మాత్రమే ప్రతిపాదించడమైంది. అయినా ఇంతవరకు చాలా తక్కువగా కేవలం లక్షమందికి మాత్రమే స్క్రీనింగ్ జరిగింది. 2047 నాటికి ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని భారత్ లక్షంగా పెట్టుకున్నా ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తన లక్షంలో కేవలం ఒక శాతం మాత్రమే పూర్తి చేయగలిగింది. షెడ్యూల్ పూర్తి చేయడంలో బాగా వెనుకబడింది.

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆధ్వర్యాన ఇటీవల ఈ సికిల్ సెల్ వాధి నివారణ ప్రయత్నాలపై సమావేశంలో చర్చ జరిగింది. 2022 23 నాటికి కోటి మందికి స్క్రీనింగ్ చేయాలన్న లక్షంలో కేవలం 1, 05,954 మందికి మాత్రమే స్క్రీనింగ్ పూర్తయిందని తెలుసుకున్నారు. వీరిలో 5.62 శాతం అంటే 5959 మంది సికిల్‌సెల్ వ్యాధి గ్రస్తులని నిర్ధారణ అయింది. బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఈ వ్యాధిని 2047 నాటికి పూర్తిగా నిర్మూలించాలన్న లక్షం పెట్టుకున్నట్టు వెల్లడించారు. అయితే ఈ లక్షం నెరవేరాలంటే 202526 నాటికి అనేక దశల్లో వ్యాధి గ్రస్తుల్లో 40 ఏళ్లలోపు వారిని ఏడు కోట్ల మందినైనా స్క్రీనింగ్‌లో చేర్చడం అవసరం. ఈ భారీ కసరత్తుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బడ్జెట్‌లో రూ. 542 కోట్లను ప్రతిపాదించింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈమేరకు రాష్ట్రాల స్థాయిలో స్క్రీనింగ్ లక్షాలను తాత్కాలికంగా సమయానుకూలంగా పూర్తి చేయాలని కోరింది. ప్రస్తుతం 15 లక్షల మంది వ్యాధిగ్రస్తులున్నారని అంచనా ఉన్నా ఇంతవరకు స్క్రీనింగ్ వ్యవస్థ ద్వారా వారిని గుర్తించడం జరగలేదు. ఈమేరకు డేటా లభ్యం కావడం అన్నది పెద్ద సవాలుగా మారింది. వ్యాధిని గుర్తించడానికి, చికిత్స చేయడానికి ఆయా రోగులకు అనుసంధానం సరిగ్గా ఉండడం లేదు. దీన్ని గమనించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ రిజిస్ట్రీని ఏర్పాటు చేసింది. స్క్రీనింగ్ డేటాను సేకరించడానికి పోర్టల్‌ను, యాప్‌ను రూపొందించింది.

సికిల్ సెల్ వ్యాధి అనేది జన్యుపరమైన రుగ్మత . ఇందులో రోగి ఎర్రరక్త కణాలు కొడవలి (సికిల్) ఆకారంలో మారిపోతుంటాయి. పెలుసుగా , అతుక్కుపోయినట్టు తయారవుతాయి. రక్త నాళాల్లో పేరుకుపోయి రక్తాన్ని గడ్డకట్టిస్తాయి. ఆక్సిజన్ సరఫరాను తగ్గించే సామర్థం వీటికి ఉంటుంది. ఫలితంగా భరించరాని నొప్పి పుట్టడమే కాకుండా అవయవాలు దెబ్బతింటాయి. ఈ వ్యాధి వారసత్వంగా పుట్టిన వారికి న్యూమోకాకల్ వ్యాక్సినేషన్ వేయడం చాలా కష్టంగా కేంద్ర మంత్రిత్వశాఖ సూచిస్తోంది. ఒకసారి సికిల్ సెల్ వ్యాధి కాని పెరిగితే ప్రస్తుతం కచ్చితంగా నయం చేసే చికిత్స అన్నదేదీ లేదు. అలా రోగిని నిర్వహించడమే అవుతుంది తప్ప వేరే దారేదీలేదు. వ్యాధిపై అవగాహన కల్పించడే అవసరమని వైద్యులు చెబుతున్నారు.

సుదీర్ఘకాలం పాటు ఎర్రరక్త కణాలు విధ్వంసం చెందటం, తీవ్రమైన నొప్పి, ఎపిసోడ్‌లు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం, అవయవాల నష్టం, కొన్ని సందర్భాల్లో తొందరగానే మరణం సంభవించే ప్రమాదం ఇవన్నీ సికిల్‌సెల్ వ్యాధి లక్షణాలే. రక్తంలో అనేక జన్యుసముదాయాలు ఉంటాయి. పుట్టిన సమయంలో తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తుంటాయి. ఒక విధమైన జన్యుసముదాయం కంటిరంగు, లేదా చర్మం రంగును నిర్ణయించడం వంటి శరీరంలో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. మరో జన్యుసముదాయం ఎర్రరక్త కణాలు తయారయ్యే, పనిచేసే విధానాన్ని నిర్ణయిస్తాయి.

ఈ జన్యువులను హిమోగ్లోబిన్ జన్యువులు అంటారు. శరీరం ద్వారా ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి సహాయపడే ఎర్ర రక్త కణాల్లోని ప్రొటీన్ తో ఈ పేరు పెట్టడమైంది. సికిల్ సెల్ అనీమియాతో బాధపడే వ్యక్తులు హిమోగ్లోబిన్ ఎస్ యొక్క జన్యువులను వారసత్వంగా కలిగి ఉంటారు. అది ఆక్సిజనును వదులుతున్నప్పుడు పొడవైన కడ్డీలను ఏర్పరుస్తుంది. ఎర్రరక్త కణాలు సాధారణంగా డిస్క్ ఆకారంలో ఉంటాయి. పొడవాటి కడ్డీలు ఎర్ర రక్త కణాల లోపల ఉండి ఎర్రరక్త కణాలను పదునైన “కొడవలి” ఆకారాలుగా రూపొందిస్తాయి. ఈ రక్త కణాలు రక్తనాళాల నుంచి సులభంగా వెళ్ల లేవు. దీనికి బదులుగా అవి రక్త నాళాలను మూసేస్తాయి. రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. కణజాలాలకు, అవయవాలకు ఆక్సిజన్ సరఫరాను నిలిపి వేస్తాయి. ఆక్సిజన్ లేకపోవడంతో శరీర అవయవాలు దెబ్బతింటాయి. సికిల్ సెల్ వ్యాదిగ్రస్తులు ప్రాణాంతక అంటువ్యాధులను పొందే ప్రమాదాన్ని కలిగి ఉంటారు.

సికిల్‌సెల్ వ్యాధి లక్షణాలు

రక్తహీనత లక్షణాలు, అలసట, శ్వాస ఆడకపోవడం, లేత చర్మం, కామెర్లు, చర్మం పసుపు రంగు లోకి మారడం, కళ్లు తెల్లబారడం, పిల్లల్లో పెరుగుదల మందగించడం, యుక్తవయసు ఆలస్యం కావడం, తరచుగా అంటువ్యాధులు సంక్రమించడం , అంధత్వం, కంటి సమస్యలు, స్ట్రోక్ తదితర లక్షణాలు కనిపిస్తాయి.

నివారణ చికిత్స

దీనికి కచ్చితమైన చికిత్స అంటూ లేక పోయినా, మూలకణ మార్పిడి (స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ )తో కొంతవరకు ఉపశమనం కలిగించవచ్చని చెబుతున్నారు. . దీన్ని బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ అంటే మజ్జ కణాల మార్పిడి అని కూడా అంటారు. దీనివల్ల ఈ వ్యాధిని కొంతవరకు నయం చేయవచ్చునని వైద్యనిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News