బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పదవీకాలాన్ని తానే పూర్తిచేస్తానంటూ ప్రకటించిన సిద్దరామయ్య ఒక్కరోజులోనే మాటమార్చారు. తానన్న మాటలను మీడియా వక్రీకరించిందంటూ ఆయన తప్పును నెట్టేసే ప్రయత్నం చేశారు. అయితే..ముఖ్యమంత్రి పదవీకాలంపై అధికార కాంగ్రెస్ పార్టీలో చర్చల జోరు మాత్రం ఏమాత్రం తగ్గకపోవడం విశేషం.
ముఖోయమంత్రిగా ఐదేళ్ల పూర్తి పదవీకాలం తానే ఉంటానంటూ గురువారం ప్రకటించిన సిద్దరామయ్య శుక్రవారం విలేకరులపై చిందులేశారు. తాను ఒకటి చెబితే మీరు ఒకటి రాస్తారంటూ ఆయన విలేకరులను మందలించారు. పారీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే తాము ఆ ప్రకారం నడుచుకుంటామని తాను చెప్పానని, తమది అధిష్టానవర్గం నడిపించే పార్టీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. హోం మంత్రి జి పరమేశ్వర ముఖ్యమంత్రి కావాలంటూ సహకార మంత్రి కెఎన్ రాజన్న చేసిన ప్రకటనపై విలేకరులు స్పందించవలసిందిగా కోరినపుడు సిద్దరామయ్య గురువారం ఆ విధంగా స్పందించారు.
కాగా.. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ బాధ్యతలు చేపడతారంటూ ఆయన విధేయ ఎమ్మెల్యేలు కొందరు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తమ విధేయతను ప్రకటించుకునే క్రమంలో పలువురి పేర్లను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. సిద్దరామయ్య అనుచరుడిగా పేరుపొందిన సహకార మంత్రి రాజన్న మరో సీనియర్ మంత్రి పరమేశ్వర పేరును తెరపైకి తెచ్చారు. పరమేశ్వరకు అదృష్టం ఉందని, భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అవుతారని రాజన్న జోస్యం చెప్పారు.
కాగా..దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, రాష్ట్ర ఐటి మంత్రి ప్రియాంక్ ఖర్గేను విలేకరులు ప్రశ్నించగా ముఖ్యమంత్రి పదవీకాలంపై నిర్ణయం తీసుకునే అధికారం పార్టీ అధిష్టాన వర్గానికే ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి నియామకం విషయమై ఢిల్లీలో చర్చలు జరిగినపుడు సిద్దరామయ్య, డికె శివకుమార్, మరో ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉన్నారని, వారి మధ్య జరిగిన చర్చల గురించి ఎవరికీ తెలియదని ఆయన అన్నారు. ఒకవేళ రేపు ముఖ్యమంత్రిగా నా పేరును అధిష్టానం ప్రకటిస్తే వెంటనే బాధ్యతలు చేపడతానని కూడా ప్రియాంక్ ఖర్గే తెలిపారు.
ఇలా ఉండగా ముఖ్యమంత్రి పదవీకాలంపై జరుగుతున్న ఊహాగానాలను ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జీవాలా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఈ అంశంపై ఎవరూ మాట్లాడరాదని ఆయన ఆదేశాలు జారీచేశారు. దీనిపై పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.