మాజీ మంత్రి కేటీఆర్ పై కర్ణాటక సిఎం సిద్దరామయ్య ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. ఫేక్ వీడియోకి, ఒరిజినల్ వీడియోకి తేడా తెలీదంటూ కేటీఆర్ ను ఎద్దేవా చేశారు.
సిద్దరామయ్య అసెంబ్లీలో మాట్లాడిన ఒక వీడియోని కేటీఆర్ ట్విట్టర్ లో రీపోస్ట్ చేశారు. ఆ వీడియోలో ‘ఎన్నికల్లో వంద హామీలిస్తాం. అంతమాత్రాన అన్నీ ఉచితంగానే ఇచ్చేయాలంటే ఎలా? ప్రభుత్వం వద్ద డబ్బులు ఉండాలి కదా’ అంటూ సిద్దరామయ్య మాట్లాడినట్లుగా ఉంది. ఈ వీడియోని కేటీఆర్ రీపోస్ట్ చేస్తూ.. ‘హామీలిచ్చేముందు ఆలోచించుకోరా? రేపు తెలంగాణలో పరిస్థితి కూడా ఇంతేనా?’ అని కామెంట్ చేశారు.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన వీడియోపై సిద్దరామయ్య రెండు రోజుల క్రితమే వివరణ ఇచ్చారు. అది నకిలీ వీడియో అనీ, ఎడిట్ చేసి, వేరే మాటలు పెట్టి, వాటిని సింక్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని ఆయన తెలిపారు. పైగా దీని వెనుక కొందరు బీజేపీ నేతల హస్తం ఉందని కూడా ఆయన ఆరోపించారు.
సిద్దరామయ్య ట్వీట్ ను కేటీఆర్ చూశారో లేదో తెలియదు కానీ, ఆ వీడియోను రీపోస్ట్ చేయడంతో సిద్దరామయ్య మండిపడ్డారు. నిజానిజాలు తెలుసుకోకపోవడంవల్లనే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిందని ఆయన ఎత్తిపొడిచారు. దీన్నిబట్టి బీజేపీకి బీఆర్ఎస్ అసలైన బి టీమ్ అని స్పష్టమవుతోందన్నారు.