ఖండించిన సిద్దరామయ్య, యడియూరప్ప
బెంగళూరు: తామిద్దరం రహస్యంగా అర్ధరాత్రి సమావేశమైనట్లు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్) నాయకుడు హెచ్‌డి కుమారస్వామి చేసిన ఆరోపణను మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, బిఎస్ యడియూరప్ప ఖండించారు. సిద్దరామయ్యను కలుసుకున్న యడియూరప్పను కట్టడి చేసేందుకే ఆయన సన్నిహితుడైన ఒక వ్యక్తి ఇంటిపై ఇటీవల ఐటి దాడులు జరిగాయంటూ కుమారస్వామి మంగళవారం ఆరోపించారు. బుధవారం సిద్దరామయ్య విలేకరులతో మాట్లాడుతూ తాను యడియూరప్పను కలుసుకున్నట్లు కుమారస్వామి నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాలు చేశారు.
యడియూరప్ప కూడా కుమారస్వామి ఆరోపణలపై స్పందిస్తూ ఇవి పూర్తిగా నిరాధార ఆరోపణలంటూ కొట్టివేశారు. తాను యడియూరప్పను ఆయన పుట్టినరోజు నాడు కలుసుకున్నానని, ముఖ్యమంత్రిగా కాని ప్రతిపక్ష నాయకుడిగా కాని తాను వ్యక్తిగతంగా ఎన్నడూ ఆయనను కలుసుకోలేదని, అందుకు తాను వ్యతిరేకినని సిద్దరామయ్య చెప్పారు. కరోనా సోకి తామిద్దరం ఒకే ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా తాము కలుసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. నిజానికి&ముఖ్యమంతిగా ఉన్నపుడు కుమారస్వామే యడియూరప్పతో తరచు సమావేశమయ్యేవారంటూ సిద్దరామయ్య ఆరోపించారు.