సిద్ధరామయ్య చేత సిఎంగా ప్రమాణం చేయించిన గవర్నర్
ఉప ముఖ్యమంత్రిగా డికె శివకుమార్ ప్రమాణం
కేబినెట్ మంత్రులుగా మరో ఎనిమిది మంది
ఖర్గే కుమారుడికి మంత్రివర్గంలో స్థానం
హాజరైన రాహుల్, ప్రియాంక, ఏడు రాష్ట్రాల సిఎంలు
పాల్గొన్న పలువురు విపక్ష నేతలు
ప్రతిపక్షాల బల నిరూపణకు కేంద్రంగా మారిన వేదిక
సిద్ధరామయ్య, డికెలకు ప్రధాని అభినందనలు
బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణం చేయడం ఇది రెండో సారి. ఉపముఖ్యమంత్రిగా డికె శివకుమార్‌చేత ప్రమాణం చేయించారు. కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ వీరిచేత ప్రమాణం చేయించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు పెద్ద సంఖ్యలలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్, ప్రియాంకగాంధీలకు శివకుమార్ స్వయంగా స్వాగతం పలికికారు. దగ్గరుండి వారికి వేదిక వద్దకు తీసుకు వచ్చారు.
మరో 8 మంది మంత్రులు కూడా..
సిఎం, డిప్యూటీ సిఎంతో పాటుగా మరో ఎనిమిది మంది క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి జి పరమేశ్వర, కెహెచ్ మునియప్ప, కెజె జార్జి, ఎంబి పాటిల్, సతీశ్ జార్కిహోళి, మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, బి జడ్ జమీర్ అహ్మద్ ఖాన్ చేత గవర్నర్ గెహ్లోత్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. అన్ని వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం లభించేలా క్యాబినెట్‌లో మంత్రిపదవులు కేటాయించినట్లు కాంగ్రెస్ తెలిపింది.