Saturday, November 23, 2024

కర్నాటక సిఎంగా సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

 డిప్యూటీగా శివకుమార్
 నాలుగైదు రోజుల ఉత్కంఠకు తెర
 20న మధ్యాహ్నం ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ /బెంగళూరు: కర్నాటకలో రోజుల తరబడి సాగిన కాంగ్రెస్ సస్పెన్స్ వీడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డికె శివకుమార్‌ను ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ అధికార వర్గాలు గురువారం ప్రకటించాయి. ఈ నెల 13వ తేదీన వెలువడ్డ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో గెలిచి, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే స్థితిలో నిలిచింది. అయితే ఈ ఇద్దరు నేతలు సిఎం పీఠం కోసం పట్టుదలకు దిగడంతో ఎవరు సిఎం అవుతారనే సందిగ్థత నెలకొంది. ఇప్పుడు సిఎంగా సిద్ధరామయ్య, డికె శివకుమార్ ఒకే ఒక్క ఉపముఖ్యమంత్రిగా ఉంటారు.

ఈ మేరకు పార్టీ అధ్యక్షులు మల్లికార్జున తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ గురువారం ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఇద్దరి ప్రమాణస్వీకారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగుతుంది. భావసారూప్య పార్టీల నేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. ఉపముఖ్యమంత్రి పదవితో పాటు డికె ఇప్పుడున్న పిసిసి అధ్యక్ష బాధ్యతలను కూడా తోడుగా నిర్వర్తిస్తారు. పార్లమెంట్ ఎన్నికల పూర్తి వరకూ ఆయనే పిసిసి అధ్యక్షులుగా ఉంటారు. కర్నాటకలో తమ ప్రభుత్వ స్థాపన గురించి కెసి వేణుగోపాల్, సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి డికె, సిద్ధరామయ్యలు వేర్వేరుగా సోనియా, రాహుల్‌ను కలిసిన క్రమంలోనే మంత్రివర్గ ఏర్పాటు క్లిష్టత తొలిగిపోయినట్లు వెల్లడైంది.

తమ పార్టీ ఎన్నికల దశలో ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ప్రాధాన్యత ఇస్తుందని సూర్జేవాలా తెలిపారు. తొలి కేబినెట్‌లోనే పార్టీ పం చ వాగ్దానాల అమలుపై కార్యాచరణకు దిగుతారని చెప్పారు. ఇద్దరు నేతల మధ్య రాజీలు, ఫార్మూలాల విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా తమ ఫార్మూలా ఒక్కటే అని , కర్నాటక ప్రజలతో అధికారాన్ని పంచుకోవడం, అందుకు అనుగుణంగా వ్యవహరించడం అన్నా రు. తమది ప్రజాస్వామిక పార్టీ అని, ఏకాభిప్రాయసాధనే కీలకం అన్నారు. గత కొద్దిరోజులుగా సాగిన ప్రక్రియ ఇదే అన్నారు. సిఎం, డిప్యూటి సిఎం ఇద్దరూ మంచి నేతలని, ఇది మంచి కలయిక అని వేణుగోపాల్ చెప్పారు. ఇద్దరికి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయని, ప్రజలకు పారదర్శక సుస్థిర ప్రభుత్వం అందించడమే పార్టీ బాధ్యత అని సూర్జేవాలా తెలిపారు.

కలిసికట్టుగా పనిచేస్తాం : సిద్ధరామయ్య, డికె
కర్నాటక ప్రజలకోసం అంకిత భావంతో కట్టుబడి పనిచేస్తామని తమ ఎంపిక తరువాత సిద్ధరామయ్య, డికెలు ప్రకటించారు. కన్నడిగుల ప్రయోజనాల పరిరక్షణకు తాము సర్వదా సంఘటితంగా ఉంటామన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందని సిద్ధరామయ్య తెలిపారు. సిద్ధరామయ్య, డికె తనతో పాటు కలిసి నిలిచి పరస్పరం అభినందనలు తెలియచేసుకుంటున్న ఫోటోను పార్టీ అధ్యక్షులు ఖర్గే ట్వీటు చేశారు. సిద్ధరామయ్య పేరును సిఎంగా ప్రకటించడంతో ఆయన స్వగ్రామం మైసూరు జిల్లాలోని సిద్ధరమణహుండిలో సంబరాలు జరిగాయి.

కలిసొచ్చిన అనుభవం, అట్టడుగు స్థాయి మద్దతు
ఇంతకు ముందు ఐదేళ్ల పాటు సిఎంగా పనిచేసిన పరిపాలనా అనుభవం, ప్రత్యేకించి ప్రజలతో మమేకం కావడం , సీనియార్టీలను పరిగణనలోకి తీసుకుని సిద్ధరామయ్యను సిఎంగా ఎంచుకున్నట్లు వెల్లడైంది. 75 సంవత్సరాల సిద్ధరామయ్యకు ఒబిసిలు, ఎస్‌సిలు, ముస్లింలలో మంచి పేరుంది. కులాలు, వర్గాల ఆధిక్యతలు ప్రాబల్యపు కర్నాటకలో ఎప్పటికప్పుడు పరిస్థితిని బేరీజు వేసుకుంటూ ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలతో ముందుకు వెళ్లగల్గుతారనే నమ్మకం సిద్ధకు పనిచేసింది.

తొమ్మిదిదఫాలు ఎమ్మెల్యే అయిన సిద్ధను కాంగ్రెస్ ఎన్నిలకు ముందునుంచే పార్టీ సిఎం అభ్యర్థిగా పేర్కొంటూ వచ్చింది. జనతాపరివార్ వ్యక్తి అయిన ఆయన తరువాత కాంగ్రెస్‌కు వచ్చి పార్టీలో తన సత్తా చాటుకున్నారు. పేద రైతు కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన సిద్ధరామయ్య తొలినాళ్లలో కాంగ్రెస్ బద్ధవిరోధి. అయితే జెడిఎస్ నుంచి ఆయనను మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ బహిష్కరించిన నేపథ్యంలో ఆయన తాను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంతకు ముందు ఒక్కసారి సిఎం అయ్యి ఇప్పుడు తిరిగి ఈ పగ్గాలు చేపడుతున్నారు. ముందు బిఎస్‌సి, తరువాత న్యాయశాస్త్రం కూడా చదివి కొంత కాలం లాయర్‌గా కూడా పనిచేసిన అనుభవం సిద్ధరామయ్యకు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News