* తొలిసారిగా మహిళలకు ప్రత్యేక రీడింగ్ రూమ్
* పోటీ పరీక్షలకు.. చిన్నారుల విజానానికి నిలయం
* సాహితి, ఆధ్యాత్మిక, ఉర్దూ పుస్తక ప్రియులకు వేదిక
* మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో 9 ప్రత్యేక విభాగాలు
* ఈ నెల 5న ప్రారంభానికి ఏర్పాట్లు
సిద్దిపేట: రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట జిల్లా గ్రంథాలయాన్ని నిర్మించారు. సిద్దిపేట బైపాస్ రోడ్డులో రూ. 2కోట్లతో నిర్మించిన అధునాతన భవనాన్ని ఈ నెల 5న మంత్రి చేతులమీదుగా ప్రారంభించనున్నారు. గ్రంథాలయాల్లో విద్యార్తులకు, ఉద్యోగార్థులకు, చిన్నారులకు, విశ్రాంత ఉద్యోగులకు, వృద్ధులకు, ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా.. 9 రకాల ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం వనితా పేరుతో ప్రత్యేక రీడింగ్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థుల అవసరాలను గుర్తించి డిజిటల్ లైబ్రరీని సైతం ఏర్పాటు చేశారు. ముస్లింల కోసం ఉర్దూ పుస్తకాలు, పిల్లలకు చిల్డ్రన్ విభాగం, జనరల్ న్యూస్ పేపర్స్ విభాగాలను విభజించారు. వీటికి తోడు సెమినార్ హాల్ ఏర్పాటు చేశారు. అన్ని రకాల ప్రత్యేకతలతో జిల్లా గ్రంథాలయ భవనాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఈ నెల 5 నుంచి పుస్తక ప్రియులకు అందుబాటులోకి రానుంది.
సిద్దిపేట ప్రజల విజ్ఞాన గని : రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేటలో విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఉపయోగపడేలా… జిల్లా లైబ్రరీని ఏర్పాటు చేశాం. గతంలో సిద్దిపేటలో గ్రంథాలయంలో ఇవన్నీ ప్రత్యేకతలు ఉండేవి కాదు. ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు పోటీ పరీక్షలకు సాంకేతికతను అందిపుచ్చుకునే డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేశాం. ఇది సిద్దిపేట ప్రజల విజ్ఞాన గనిగా పుస్తక పూదోటగా ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటుంది. సిద్దిపేట ప్రజలకు అన్ని ఒకే చోట అందరూ ఓకే చొట అన్ని రకాల పుస్తకాలు ఎవరికి నచ్చినవి వారు చదువుకునేలా.. ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశాం. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. సిద్దిపేట లైబ్రరీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుంది.