Thursday, January 23, 2025

పక్క చూపులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ పోరులో అధిక సీట్లు సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ పార్లమెంట్‌లో ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని కృత నిశ్చయంతో ఉంది. ఈ ఎన్నికల్లో గతంలో సాధించిన సీట్ల కంటే ఎక్కువ సాధించి తమ సత్తా చాటుకునేందుకు బిఆర్‌ఎస్ ప్రణాళికలు రచిస్తుండగా కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తామనే ధీ మాతో ఉన్న బిజెపి అధిక సీట్లు సా ధించేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు వలసలపై దృష్టి సారిస్తూ బలమైన నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించి సీట్లు ఇ స్తుండగా, బిఆర్‌ఎస్ పార్టీ బిఎస్‌పితో పొత్తు పెట్టుకోవడంతో పాటు తెలంగాణ ఉద్యమ శక్తులను ఏకం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

గెలుపు గుర్రాల కోసం పార్టీల వేట
మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మిగిలిన స్థానాల్లో కచ్చితంగా గెలిచే అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. సీనియర్లు, కొత్త అభ్యర్థులు అనే తేడా లేకుండా పార్టీ టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తారనుకునే అభ్యర్థుల కోసం ఆయా పార్టీలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఇందుకోసం ఇతర పార్టీలలో ఉన్న బలమైన నాయకులను గుర్తించి వారికి తమ పార్టీలోకి ఆహ్వానించి వెంటనే టికెట్లు కేటాయిస్తున్నారు.

ఇటీవల బిజెపి 9 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేయగా, అందులో అధికంగా వేరే పార్టీ నుంచి వచ్చిన వలస నేతలకే ఎంపీ టికెట్లు కేటాయించారు. బిఆర్‌ఎస్ ఎంపీలు బీబీ పాటిల్, రాములు బిజెపి పార్టీలో చేరిన వెంటనే బీబీ పాటిల్‌తో పాటు రాములు కుమారుడు భరత్‌కు బిజెపి టికెట్లు ఇచ్చింది. అలాగే గతంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చేవెళ్ల టికెట్, బూర నర్సయ్య గౌడ్‌కు భువనగిరి టికెట్లు కేటాయించారు. తాజాగా ఆదివారం బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎంపిలు, ఇద్దరు మాజీ ఎంఎల్‌ఎలు బిజెపిలో చేరారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎంపీ గోడం నగేశ్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అలాగే మాజీ ఎంఎల్‌ఎలు జలగం వెంకట్రావు, శానంపూడి సైదిరెడ్డిలు ఢిల్లీలో తరుణ్‌చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ నలుగురికి కూడా టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బిఆర్‌ఎస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి, సునీతలతో పాటు బొంతు రామ్మోహన్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు మరికొంత మంది త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బిజెపి పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీ మారినా సరే కచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఉన్న నేతలకు ప్రధాన పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీల్లో మరికొంత బలమైన నాయకులు చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గెలిచే అవకాశాలు ఉన్న నేతల చేరికల తర్వాతనే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించాలని ఆ పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పొత్తులపై బిఆర్‌ఎస్ దృష్టి
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మారుతున్న రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా బిఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో బిఎస్‌పితో కలిసి పోటీ చేస్తామని ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బిఎస్‌పితో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి రెండు సీట్లు కేటాయించే అవకాశం ఉంది. బిఎస్‌పి పార్టీతో పొత్తు వల్ల దళిత బహుజన వర్గాలు బిఆర్‌ఎస్‌కు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నట్లు గులాబీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ పొత్తు వల్ల బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు మెరుగవుతాయని బిఆర్‌ఎస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. బిఆర్‌ఎస్ పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే పలు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించగా, మిగిలిన స్థానాలలో బలమైన నాయకులను ఎంపిక చేసేందుకు బిఆర్‌ఎస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణలపై అన్ని అంశాలను పార్టీ ముఖ్యనేతలతో చర్చించి అధినేత కెసిఆర్ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News