అమృత్‌సర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ రేపో మాపో ప్రకటించనున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలహీనమైన ముఖ్యమంత్రి ఉండాలని పైస్థానంలో ఉన్నవారు కోరుకుంటున్నారంటూ సిద్ధూ వ్యాఖ్యానించారు. తాము చెప్పినట్లు ఆడే బలహీనమైన ముఖ్యమంత్రి ఉండాలన్నది పైస్థానంలో ఉన్న వారి కోరికని గురువారం సాయంత్రం తన మద్దతుదారులనుద్దేశించి ప్రసంగిస్తూ సిద్ధూ అన్నారు. అయితే కాంగ్రెస్ కేంద్ర నాయకత్వాన్ని ఉద్దేశించా లేక మరెవరినైనా ఉద్దేశించా అన్నది ఆయన స్పష్టం చేయలేదు. కాగా..సిద్ధూ వ్యాఖ్యలపై ఆయన మీడియా సలహాదారును సంప్రదించగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే ఆదివారం(ఫిబ్రవరి 6) లూధియానాలో పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనున్న నేపథ్యంలో సిద్ధూ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించకున్నాయి. ఇలా ఉండగా..గత కొద్ది నెలలుగా పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పిసిసి అధ్యక్షుడు సిద్ధూ తమను తాము ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రచారం చేసుకుంటున్నారు.