పోలీసుల అదుపులో 8 మంది నిందితులు
ముంబై: హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా అభిమానినని చెప్పుకుని, ఆయనతో సెల్ఫీ తీసుకున్న వ్యక్తితోసహా ఎనిమిది మందిని సిద్ధూ హంతకులకు సాయపడ్డారన్న ఆరోపణలపై పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. హంతకులకు వాహనాలు సమకూర్చడం, రెక్కీ నిర్వహించడం, హంతకులకు ఆశ్రయం కల్పించడం వంటివి హంతకులపై పోలీసులు నమోదు చేసిన ఆరోపణలు. మే 29వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు సిద్ధూ తన పొరుగున నివసించే గుర్వీందర్ సింగ్, గురుప్రీత్ సింగ్‌తో కలసి తన మహీంద్ర థార్ వాహనంలో బయల్దేరగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ హత్యతో సంబంధమున్న నలుగురు షూటర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మీ అభిమానినంటూ సిద్ధూను పరిచయం చేసుకున్న హర్యానాలోని సిర్సాకు చెందిన సందీప్ సింగ్ అలియాస్ కేక్డా హత్యకు గురికావడానికి ముందు ఆయనతో సెల్ఫీ తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సిద్ధూ కదలికలను ఎప్పటికప్పుడు అతను షూటర్లకు సమాచారం అందచేశాడని వారు తెలిపారు.