పంజాబ్ సిఎం మాన్ ప్రకటన
చండీగఢ్: పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యపై దర్యాప్తు చేసేందుకు హైకోర్డు సిట్టింగ్ జడ్జితో జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం ప్రకటించారు. తన కుమారుడు సిద్ధూ మూసేవాలా హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన తండ్రి బల్కూర్ సింగ్ విజ్ఞప్తి చేయడంతో ముఖ్యమంత్రి మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తులో సిబిఐని, ఎన్‌ఐఎని కూడా జతచేయాలని కూడా బల్కూర్ సింగ్ డిమాండ్ చేశారు. సిద్ధూ హత్యపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈ హత్యను సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి పంజాబ్, హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను పంజాబ్ ప్రభుత్వం కోరుతుందని తెలిపారు. జుడిషియల్ విచారణ కమిషన్‌కు తన ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, ఎన్‌ఐఎ సహాయాన్ని కోరడానికి కూడా సిద్ధమేనని ఆయన చెప్పారు.