మన తెలంగాణ/హైదరాబాద్ : పెండింగ్‌లో ఉన్న యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బిఆర్‌ఎస్‌వి ఆధ్వర్యం లో రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, నోటిఫికేషన్ల ఆశావహులు తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వా తావరణం చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. నల్ల జెండాలు చేతబూనిన నిరసనకారులు రాజ్‌భవన్ వద్ద బారీకేడ్లను తోసుకొని లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
గవర్నర్ వెంటనే యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లును వెంటనే ఆమోదించాలని బిఆర్‌ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆమె నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం దాదాపు 5 నెలల కింద బిల్లులు పాస్ చేసి పంపిస్తే ఇప్పటివరకు గవర్నర్ బిల్లు ఆమోదించకుండా రాజ కీయం చేస్తున్నారని విమర్శించారు. సదరు బిల్లును గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం వల్ల సుమారు మూడు వేల ప్రొఫెసర్ పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బిజెపి నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పినట్లు గవర్నర్ తమిళిసై వింటున్నారని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. తమిళిసై బిల్లు ఆమోదించే వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.