విద్యా రంగం సమస్యల పరిష్కారం కోరుతూ పిడిఎస్‌యూ, పివైఎల్ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆయా సంఘాల కార్యకర్తలను, నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్భంగా తోపులాట సాగింది. పిడిఎస్‌యూ, పివైఎల్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు విద్యారంగం సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరితే పోలీసులతో అణిచివేత చర్యలకు దిగడం శోచనీయమన్నారు.
ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించాని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని, జాబ్ క్యాలండర్‌ను తక్షణమే రూపొందించి, ఉద్యోగాల ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని వారు కోరారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.