ఫ్రీటౌన్( సియారా లియోన్): సాయుధ దుండగులు దేశ రాజధానిలోని సైన్యానికి చెందిన ప్రధాన బారక్స్‌పై దాడి చేయడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చని, తిరుగుబాట్లు చోటు చేసుకోవచ్చన్న భయంతో ఆఫ్రికా దేశమైన సియారా లియోన్ అధ్యక్షుడు జూలియస్ మాడా బియో ఆదివారం దేశవ్యాప్తంగా కర్ఫూ ప్రకటించారు. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని సాయుధులు దేశ రాజధాని ఫ్రీటౌన్‌లో ఉన్న విల్బర్‌ఫోర్స్ బ్యారక్స్‌లో ఉన్న ప్రధాన మిలిటరీ ఆయుధాగారంపై దాడి చేసినట్లు ‘ఎక్స్’లో ఉంచిన ఓ పోస్టులో బియో తెలిపారు. అయితే వారిని భద్రతా దళాలు తరిమి కొట్టాయని, ప్రశాంత పరిస్థితిని పునరుద్ధరించినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
తమ భద్రతా దళాలకు చెందిన ఉమ్మడి దళం, పారిపోతున్న తిరుగుబాటుదారులను తుదముట్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్తూ, ముందుజాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా కర్ఫూ విధించినట్లు పేర్కొన్నారు. జనం ఇళ్లలోనే ఉండాలని ఆ పోస్టులో తెలిపారు. భద్రతా దళాలు పరిస్థితిని అదుపు చేశాయని సమాచార, విద్యాశాఖ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో హింస చెలరేగవచ్చన్న అది తోసిపుచ్చింది. కాగా సాయుధులకు సంబంధించి ఎలాంటి వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు కొద్ది నెలల క్రితం బియో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దాదాపు 80 లక్షల జనాభా కలిగిన సియారా లియోన్ ప్రపంచంలోనే అత్యంత నిరుపేద దేశంగా గుర్తింపు పొందింది.