Tuesday, December 24, 2024

సంతకాలు పెట్టి అప్పగించారు

- Advertisement -
- Advertisement -

పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించలేదు

నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ మాటలన్నీ ఉత్తవే : హరీశ్‌ రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : గడిచిన పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించలేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టుల విషయంలో ఉత్తం మాటలు ఉత్తవే అని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రాజెక్టులను సంతకాలు చేసి కేంద్రానికి అప్పగించిందని ఆరోపించారు. ప్రాజెక్టుల అప్పగింత కుదరదని మాజీ సిఎం కెసిఆర్ రెండో అపెక్స్ భేటీలోనే స్పష్టం చేశారని గుర్తు చేశారు. మంగళవారం(ఫిబ్రవరి 13) తాము నల్గొండలో సభ పెట్టినందువల్లే అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులపై తీర్మానం పెట్టారని వాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభలో సోమవారం కృష్ణా ప్రాజెక్టులు, కెఆర్‌ఎంబి సంబంధిత అంశాలపై ప్రవేశపెట్టిన తీర్మానంపై అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కెసిఆర్ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని ఆరోపించగా, దీనిపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ టి.హరీశ్ రావు ధీటుగా సమాధానం ఇచ్చారు. బిఆర్‌ఎస్‌పై బురద జల్లేందుకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చూస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. వాస్తవాలు సభకు తెలియాలనే ఉద్ధేశంతో అసెంబ్లీలో ప్రజంటేషన్‌కు తమకు అవకాశం ఇవ్వాలని కోరామని, కానీ తమకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. పోతిరెడ్డిపాడు కోసం పేగులు తెగేదాక కొట్లాడింది బిఆర్‌ఎస్సేనని, కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఒక నెలలోనే కృష్ణా జలాల పునఃపంపిణీకి కేంద్రానికి లేఖ పెట్టామని చెప్పారు. ఒకటిన్నర సంవత్సరం అయినా కేంద్రం స్పందించకుంటే తాము సుప్రీంకు వెళ్లామన్నారు. కృష్ణా జలా ల పంపిణీపై కేంద్రానికి 27 లేఖలు రాశామని తెలిపారు. 299 టిఎంసిల వాటాకు ఆద్యులే గత కాంగ్రెస్ పాలకులని హరీశ్‌రావు విమర్శించారు. నెల రోజుల్లో ప్రాజెక్టులు కెఆర్‌ఎంబికి అప్పగిస్తామని ఈ ఏడాది జనవరి 17 నాటి భేటీలో ప్రభుత్వం తెలిపిందని ఆరోపించారు. దీని వల్ల తెలంగాణ ఇంజనీర్లు డ్యామ్‌లపైకి వెళ్లాలంటే కెఆర్‌ఎంబి అనుమతి కావాలని పేర్కొన్నారు. ప్రాజెక్టుల అప్పగింతపై జనవరి 18న అన్ని పత్రికల్లో పతాక శీర్షికలో వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. అందుకే తాను జనవరి 19న ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశానని వివరించారు. జనవరి 17న జరిగిన భేటీ అంశాలు మరునాడే బయటకు వచ్చాయని హరీశ్‌రావు చెప్పారు. కానీ అందులో తప్పు ఉందని ప్రభుత్వం గుర్తించి జనవరి 27న మంత్రి కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. మరి అదే మంత్రి పది రోజులపాటు ఏం చేశారని, ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఫిబ్రవరి 1 నాటి రెండో సమావేశంలోనూ ప్రాజెక్టులు అప్పగిస్తామని ప్రభుత్వం తెలిపిందని ఆరోపించారు. నీటి వాటాల్లో 50:50 కావాలని కేంద్రానికి లేఖ రాశామని, తమపై బురదజల్లాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు.
బిఆర్‌ఎస్ పోరాటం వల్లే ట్రైబ్యునల్ ఏర్పాటు
బిఆర్‌ఎస్ పోరాటం వల్లే కృష్ణా జలాల పంపిణీకి ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కెసిఆర్ ప్రాణాలు పోయినా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేయలేదు అని ఉద్ఘాటించారు. సోనియా గాంధీని కెసిఆర్ దేవత అన్నారని కాంగ్రెస్ సభ్యులు అంటున్నారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియాగాంధీని బలిదేవత అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పరిస్థితి కుడిదిల పడ్డ ఎలుక లెక్క అయ్యిందని ఎద్దేవా చేశారు. స్మితా సబర్వాల్ ప్రాజెక్ట్లులు కేంద్రానికి ఇస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదని, అపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయం అయ్యేదాకా 50:50 ఇవ్వండి అని కేంద్రానికి రాశారని గుర్తు చేశారు. కెఆర్‌ఎంబి ప్రాజెక్టుపై స్మితా సభర్వాల్ తరహాలోనే రాహుల్ బొజ్జా కూడా కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలకులు అధికారులపైకి తమ తప్పులు నెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన తీర్మానంలోని డిమాండ్లకు తమ మద్దతు ఉంటుందని, కానీ గత రెండు మీటింగ్‌లలో తెలియకుండా ఒప్పుకున్నాము అని సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లగొండ సభకు స్పందనగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పజెప్పబోమని తీర్మానం చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ మొన్న బడ్జెట్ ప్రవేశ పెట్టారు, దాని మీద చర్చ చేయకుండా మంగళవారం బిఆర్‌ఎస్ నల్లగొండ సభ పుణ్యమా అని ఈరోజు కృష్ణా నదీ జలాల అంశంపై చర్చ పెట్టారని అన్నారు.
అవాస్తవాల పుస్తకం అని పేరు రాయాల్సింది
కృష్ణా ప్రాజెక్టుల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విషయాలు వాస్తవాలు కాదని.. అవి అవాస్తవాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పుస్తకం పేరు అవాస్తవాల పుస్తకం అని రాయల్సింది అని అన్నారు. ప్రాజెక్టులు అప్పగించే విషయం నాటి ప్రభుత్వం ఒప్పుకున్నది అని అబద్ధాలు ప్రభుత్వం అవాస్తవాలు చెప్పిందని మండిపడ్డారు. అవాస్తవాలను ఏంటనేవి హరీశ్‌రావు ఒక్కొక్కటిగా సభలో వివరించారు. అపెక్స్ కమిటీ మీటింగ్‌లో కెఆర్‌ఎంబి కనిపించలేదని, ఎందుకంటే విషయంలో న్యాయస్థానం పరిధిలో ఉందని తెలిపారు. రెండోది.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ సవాలు చేయలేదని, దీనికి సాక్ష్యం రాహుల్ బొజ్జా రాసిన ఆధారం చూడొచ్చని పేర్కొన్నారు. 2021 జులై 15వ తేదీ గెజిట్‌లో సవరణ చేయాలని రాశారని పేర్కొన్నారు. ఇక మూడవ అవాస్తవం.. 16వ బిఆర్‌ఎంబి సమావేశంలో ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని స్పష్టం చేశారని, నాలుగవ అవాస్తవం రెండో అపెక్స్ కౌన్సిల్‌లో నీటి వాటా వ్యతిరేకించడం జరిగిందని, ఈ విషయంపై తమ ప్రభుత్వం కేంద్రానికి 27 లేఖలు రాసిందని హరీశ్‌రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News