Tuesday, November 5, 2024

ఇక నావల్ల కాదు నాన్నా… నన్ను క్షమించండి

- Advertisement -
- Advertisement -

Sikh woman dies by suicide in US

ఆత్మహత్యకు ముందు వీడియోలో తండ్రిని వేడుకున్న బాధితురాలు
న్యూయార్క్ లోని భర్త, అత్తింటి వేధింపులకు బలైన మన్‌దీప్ కౌర్

ఢిల్లీ /బిజ్నోర్ : న్యూయార్క్‌లో ఉంటున్న భారతీయ మహిళ భర్తతోపాటు అత్తమామల హింసాత్మక వేధింపులకు బలై చివరకు ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అయి నెటిజన్లలో తీవ్ర ఆగ్రహావేశాలను రేపుతోంది. యూపీ లోని బిజ్నోర్‌కు చెందిన 30 ఏళ్ల మన్‌దీప్ కౌర్ 2015లో రంజోద్ బీర్ సింగ్ సంధును వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. కొన్నాళ్లు వీరి కాపురం సంతోషంగా గడిచినా, ఇద్దరు కూతుళ్లు పుట్టిన తరువాత కష్టాలు ఎక్కువయ్యాయి. ఏదో ఒకరోజు తన భర్త మారతాడనే ఆశతో ఆమె వేధింపులను భరిస్తూ వచ్చింది. వేధింపులు తగ్గక పోగా మరింత తీవ్రం కావడంతో తన భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ తల్లిదండ్రులకు గోడును వెళ్లబోసుకుంది. తనను ఏ విధంగా చిత్రహింసల పాలు చేస్తున్నారో రుజువు చేసే వీడియోలను కూడా తల్లిదండ్రులకు పంపించింది. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంగతి తెలుసుకున్న భర్త తనను కాపాడాలని భార్యను వేడుకున్నాడు.

భర్త మారాడని నమ్మిన బాధితురాలు కేసు పెట్టడానికి వెనక్కు తగ్గింది. ఆ తర్వాత మళ్లీ ఆమెకు చిత్రహింసలు యధాప్రకారం కొనసాగాయి. ఇక వారి వేధింపులు భరించలేక ఆమె ఒక సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వివరిస్తూ నాన్న నన్ను క్షమించండి. నన్ను చచ్చిపొమ్మని భర్త, అత్తమామలు వేధిస్తున్నారని, ఇక తన వల్ల కాదంటూ మన్‌దీప్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియోలో తెలిపింది. అల్లుడు తమ కూతుర్ని ఏ విధంగా వేధించే వాడో వివరిస్తూ పలు వీడియోలు తమ కూతురు పంపించిందని తల్లిదండ్రులు చెప్పారు. తమ కూతురు మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని కోరుతున్నారు. ఈ విధంగా వేధింపులకు గురౌతున్న మహిళలను ఆదుకునేందుకు ది కౌర్ మూవ్‌మెంట్ అనే సంస్థ అక్కడ పనిచేస్తోంది. మన్‌దీప్ కౌర్ సెల్ఫీ వీడియోను ఈ సంస్థ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో సంచలనం కలిగిస్తోంది. నెటిజన్ల ఆగ్రహంతో భగ్గుమంటున్నారు. న్యూయార్క్ రిచ్‌మండ్ హిల్ లోని మన్‌దీప్ కౌర్ ఇంటి బయట జనం గుమికూడి న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ నుంచి కొందరు సామాజిక ఉద్యమ నేతలు బిజ్నోర్ వెళ్లి ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News