Monday, December 23, 2024

సిక్కింలో ఆకస్మిక వరదలు.. 43 మంది గల్లంతు

- Advertisement -
- Advertisement -

గ్యాంగ్‌టక్ : ఈశాన్య రాష్ట్రం సిక్కింలో మంగళవారం రాత్రి కురిసిన కుంభవృష్టికి లాచెన్ లోయలో గల తీస్తానది ఉప్పొంగడంతో ఆకస్మికంగా వరదలు ముంచెత్తాయి. ఇందులో 23 మంది ఆర్మీ సిబ్బందితోపాటు మరో 20 మంది పౌరులు గల్లంతైనట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించింది. మిగిలిన వారి కోసం గాలింపు సాగుతోంది.

ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం రాత్రి కుంభవృష్టి కురిసి తీస్తానది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో చుంగ్‌థాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంతంలో నీటి మట్టం అమాంతంగా 1520 అడుగుల మేర పెరిగి అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా వరదలు ముంచుకొచ్చాయి. లాచెన్ లోయలోని ఆర్మీ పోస్టులు నీట మునిగాయి. సింగ్లమ్ ప్రాంతంలో ఆర్మీ వాహనాలు కొట్టుకుపోయాయి. అందులోని 23 మంది సిబ్బంది గల్లంతైనట్టు ఈస్ట్రన్ కమాండ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

41 వాహనాలు నీట మునిగినట్టు తెలిపింది. గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. వరదలు సంభవించిన ప్రాంతంలో ఇంటర్నెట్ సదుపాయం సరిగా లేక, అక్కడి ఆర్మీ సిబ్బందిని కమాండ్ స్థాయి అధికారులను సంప్రదించడం కష్టంగా మారిందని సైనిక వర్గాలు వెల్లడించాయి. ఇక తీస్తానది ఉగ్ర రూపం దాల్చడంతో సింగ్తమ్ ఫుట్ బ్రిడ్జి కుప్పకూలింది. అటు పశ్చిమ బెంగాల్, సిక్కింను కలిపే 10 వ నెంబరు జాతీయ రహదారి చాలా చోట్ల కొట్టుకుపోయింది.

గల్లతీస్తానది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమంగ్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించి ముఖ్యమంత్రితో మాట్లాడారు. కేంద్రం నుంచి తగిన సహాయం అందుతుందని భరోసా ఇచ్చారు. బాధితులంతా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని తాను భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని ఎక్స్ (ట్విటర్) ద్వారా తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News