కుర్రకారుకు కిర్రెక్కించిన సిల్క్ స్మిత చనిపోయి పాతికేళ్లు దాటినా ఇప్పటికీ ఆమెకున్న క్రేజ్ తగ్గలేదు. క్లబ్ డాన్సర్ గానే కాకుండా, సీతాకోక చిలుక, వసంత కోకిల వంటి చిత్రాలతో నటిగానూ నిరూపించుకుంది. కన్నడంలో వండిచక్రం (బండిచక్రం) సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె పాత్ర పేరు సిల్క్ కావడంతో, అదే పేరు ఆమెకు స్థిరపడిపోయింది. సిల్క్ సొంత ఊరు ఏలూరు. అసలు పేరు విజయలక్ష్మి. పదిహేనేళ్లపాటు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన స్మిత… 1996 సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
తాజాగా సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా ఆమె బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. జయరాం దర్శకత్వంలో చంద్రకా రవి నటిస్తున్న ఈ సినిమాకు ‘సిల్క్ స్మిత.. ది అన్ టోల్డ్ స్టోరీ’ అనే పేరు ఖరారు చేశారు. డిసెంబర్ 2న సిల్క్ పుట్టినరోజు సందర్భంగా సినీ యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో చంద్రికా రవి పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఆమెకు స్మిత ఫీచర్స్ ఉన్నాయంటూ అభిమానులు సినిమా యూనిట్ ను అభినందిస్తున్నారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన చంద్రికా రవికి ఆ తర్వాత చెప్పుకోదగిన పాత్రలు రాకపోయినా, సిల్క్ స్మిత బయోపిక్ లో ఛాన్స్ రావడం విశేషం.