మన తెలంగాణ/హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఫైనల్ బలహీనత మరోసారి బయటపడింది. ఫైనల్ వరకు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా దూసుకొచ్చే సింధు తుది మెట్టుపై మాత్రం పేలవమైన ఆటతో నిరాశ పరచడం అలవాటుగా మార్చుకుంది. ఎన్నో టోర్నమెంట్‌లలో సింధు ఫైనల్లో పరాజయం పాలై టైటిల్‌కు దూరమైన విషయం తెలిసిందే. సింధుకు ఫైనల్ ఫొబియా వెంటాడుతుందని, దాని నుంచి బయటపడడంలో వైఫల్యం చవిచూస్తోందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. తాజాగా స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్లో కూడా చిరకాల ప్రత్యర్థి కరోలినా మార్టిన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఫైనల్ వరకు అసాధారణ ఆటతో అలరించే సింధు ఆఖరి సమరంలో మాత్రం పేలవమైన ఆటతో నిరాశ పరుస్తూ వస్తోంది. ఇక చాలా కాలం తర్వాత ఫైనల్‌కు చేరిన సింధు ఈసారి ఎలాగైన టైటిల్ సాధిస్తుందని కోట్లాది మంది భారత అభిమానులు ఆశించారు. కానీ సింధు మాత్రం తన ఫైనల్ ఫొబియో నుంచి బయట పడలేక రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.
తేలి పోతున్న షట్లర్లు..
చైనా, జపాన్, కొరియా, చైనీస్‌తైపీ, డెన్మార్క్, ఇండోనేషియా, మలేసియా తదితరు దేశాలకు చెందిన షట్లర్లు వరుస టైటిల్స్‌తో చెలరేగిపోతుండగా భారత్‌కు చెందిన సింధు, సైనా నెహ్వాల్ తదితరులు పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నారు. వీరిద్దరూ కనీసం క్వార్టర్ ఫైనల్ దశ కూడా దాటడం లేదు. కరోనా నేపథ్యంలో కిందటి ఏడాది పలు టోర్నమెంట్‌లు రద్దయ్యాయి. దీంతో ఇటు సింధుకు, అటు సైనాకు తగినంత విశ్రాంతి కూడా లభించింది. అయితే ఈ ఖాళీ సమయాన్ని తమ ఫిట్‌నెస్‌ను మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించి ఉంటే వీరికి ప్రయోజనంగా ఉండేదని బ్యాడ్మింటన్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇతర దేశాల షట్లర్లు నిలకడైన ఆటతో విజయపథంలో దూసుకు పోతుండగా భారత క్రీడాకారిణిలు మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాశే మిగుల్చుతున్నారు. ఈ ఏడాది ఆడిన అన్ని టోర్నమెంట్‌లలోనూ సింధు, సైనాలు పేలవమైన ఆటతో నిరాశ పరిచారు.
ఇక పురుషుల సింగిల్స్‌లో కూడా కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, అజయ్ జయరాం, హెచ్.ఎస్. ప్రణయ్ తదితరులు కూడా వరుస ఓటములతో సతమతమవుతున్నారు. ఆటగాళ్లు పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నా ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ వీరిపై దృష్టిపెట్టక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సింధు, సైనా, శ్రీకాంత్ వంటి ప్రతిభావంతులైన క్రీడాకారులు అందుబాటులో ఉన్నా రెండేళ్లుగా భారత్‌కు ఒక్క టైటిల్ కూడా లభించక పోవడం బాధించే అంశమే. ఇక ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ సమీపిస్తున్న భారత షట్లర్లు గాడిలో పడక పోవడం అభిమానులను కలవరానికి గురిచేస్తోంది ఇప్పటికైన ఇటు ప్రధాన కోచ్ గోపీచంద్ క్రీడాకారుల లోపాలను గుర్తించి వారిలో గాడిలో పడేలా చూడాలి. అంతేగాక షట్లర్లు కూడా తమ ఆటను మెరుగు పరుచుకోవడంపై దృష్టి పెట్టాలి.