యమగూచికి షాక్, సెమీస్‌కు దూసుకెళ్లిన తెలుగుతేజం
టోక్యో: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి.సింధు టోక్యో ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ గెలుపుతో సింధు ఒలింపిక్ రెండో పతకానికి మరింత చేరువైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య దేశం జపాన్‌కు చెందిన అకానె యమగూచిని మట్టికరిపించి సెమీస్‌కు చేరింది. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో సింధు 21-13, 22-20 తేడాతో యమగూచిని ఓడించింది. ఆరంభ సెట్‌లో సింధు దూకుడుగా ఆడింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగింది. యమగూచితో పోరులో ఎప్పుడూ ఒత్తిడికి గురయ్యే సింధు ఈసారి ఆరంభం నుంచే చెలరేగి పోయింది. ఒత్తిడిని దరిచేర నీయకుండా ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేసింది. ఆమె ధాటికి యమగూచి ఎదురు నిలువలేక పోయింది. కళ్లు చెదిరే షాట్లతో చెలరేగి పోయిన తెలుగుతేజం పెద్ద శ్రమపడకుండానే మొదటి గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది.
హోరాహోరీ..
అయితే రెండో గేమ్‌లో మాత్రం పోరు ఆసక్తికరంగా సాగింది. ఈసారి యమగూచి మళ్లీ పుంజుకుంది. తన మార్క్ షాట్లతో సింధుకు గట్టి పోటీ ఇచ్చింది. ఇటు సింధు అటు యమగూచి ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. ఇద్దరు దూకుడుగా ఆడుతూ వరుస క్రమంలో పాయింట్లను సాధించుకుంటూ పోయారు. దీంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. అయితే కీలక సమయంలో భారత స్టార్ షట్లర్ అనూహ్యంగా పుంజుకుంది. యమగూచిని వెనక్కి నెడుతూ మ్యాచ్ పట్టు సాధించింది. ఇదే క్రమంలో మళ్లీ ఆధిక్యాన్ని సాధించి లక్షం వైపు దూసుకెళ్లింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన సింధు 2220తో సెట్‌ను గెలిచి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఈ విజయంతో సింధు అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో వరుసగా రెండోసారి సెమీస్‌కు చేరుకున్న తొలి షట్లర్‌గా సింధు రికార్డు సృష్టించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి, చైనీస్ తైపీ షట్లర్ తై జు యింగ్‌తో తలపడుతుంది.
తైజునే ప్రధాన అడ్డంకి..
సెమీస్‌కు చేరే క్రమంలో ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారిణిలను ఓడించిన భారత స్టార్ సింధుకు సెమీఫైనల్‌ల్లోనూ గట్టి ప్రత్యర్థే ఎదురుకానుంది. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న చైనీస్ తైపీ షట్లర్ తై జు యింగ్‌తో సింధు తలపడనుంది. తై జుపై సింధు రికార్డు అంతంత మాత్రంగానే ఉంది. ఇద్దరు 18 సార్లు తలపడగా సిందు కేవలం ఐదు సార్లు మాత్రమే గెలిచింది. దీంతో సెమీస్‌లో సింధు ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే యమగూచి, బ్లిన్ ఫెల్ట్ వంటి స్టార్‌లను అలవోకగా ఓడించిన సింధుకు సెమీస్‌లో తై జు ఓడించడంతో పెద్ద ఇబ్బందేమీ కాక పోవచ్చు. తన మార్క్ ఆటతో చెలరేగి పోతే సింధు ఫైనల్‌కు చేరడం ఖాయం. ఇక ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. బ్రెజిల్ వేదికగా జరిగిన కిందటి ఒలింపిక్స్‌లో సింధు రజతం సాధించింది. ఈసారి కూడా ఫైనల్ చేరితో సింధు ఖాతాలో మరో రజతం చేరుతుంది. ఇందులో ఆమె సఫలం కావాలని కోరుకుందాం.