సింగపూర్ : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మరణ శిక్ష పడిన ఇద్దరు దోషులను సింగపూర్ ఈ వారం ఉరితీయనుంది. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. కాగా, సింగపూర్‌లో ఓ మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం గత 20 ఏళ్లలో ఇది తొలిసారి కావడం గమనార్హం. 50 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో దోషిగా తేలిన 56 ఏళ్ల వ్యక్తిని ఈ బుధవారం (జులై 26) చాంగీ జైలులో ఉరి తీయనున్నట్టు స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్‌ఫర్మేటివ్ జస్టిస్ కలెక్టివ్ (టీజేసీ) వెల్లడించింది.
ఇక వచ్చే శుక్రవారం (జులైఏ 28) 45 ఏళ్ల మహిళ సారిదేవి దామనికి కూడా ఉరిశిక్ష అమలు చేయనున్నట్టు ఆ సంస్థ తెలిపింది. 30 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో 2018 లో ఆమెకు ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష అమలు తేదీలపై ఇప్పటికే వారి కుటుంబాలకు నోటీసులు పంపించారని టీజేసీ పేర్కొంది. ఈ ఉరిశిక్ష అమలైతే దాదాపు గత 20 ఏళ్లలో సింగపూర్‌లో ఓ మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి కానుంది. గతంలో డ్రగ్‌ట్రాఫికింగ్ కేసులో దోషిగా తేలిన 36 ఏళ్ల మహిళ యెన్ మే వుయెన్‌కు 2004 లో ఉరిశిక్ష అమలు చేశారని టీజేసీ కార్యకర్త కోకిల అన్నామలై తెలిపారు.
అయితే ఈ ఇద్దరి ఉరిశిక్ష అమలును నిలిపివేయాలని హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. సింగపూర్‌లో హత్యలు, కిడ్నాప్‌ల వంటి తీవ్రమైన నేరాలకు మరణ శిక్షలు విధిస్తారు. ఇక మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు కూడా అత్యంత కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసుల్లో దోషులకు మరణశిక్ష తప్పదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల పాటు మరణశిక్షల అమలును నిలిపివేసిన సింగపూర్ , ఈ మధ్య మళ్లీ శిక్షల అమలు చేపట్టింది. అలా ఇప్పటివరకు 13 మందిని ఉరి తీసింది. ఆ మధ్య ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు కూడా మరణశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే.