Saturday, November 9, 2024

సింగరేణి తెలంగాణదే

- Advertisement -
- Advertisement -

నిర్ణయాన్ని త్వరలో తెలియజేస్తామన్న అజయ్ భల్లా
ఆప్మేల్ పై సమర్థవంతంగా రాష్ట్రం వాదన
ఎపి నుంచే తెలంగాణ విద్యుత్ సంస్థలకు రూ.12,111కోట్లు రావలసి ఉంది
కోర్టులకెక్కడంతో విభజన సమస్యలు జఠిలం
షెడ్యూల్ 9లోని సంస్థలపై ఎపి షరతులను ఉల్లంఘిస్తూ వస్తోంది
తెలుగు రాష్ట్రాల విభజన వివాదాలపై కేంద్ర హోంశాఖ సమీక్షా సమావేశంలో సిఎస్ సోమేశ్ నేతృత్వంలోని బృందం వాదనలు
ఓడరేవుల నిర్మాణాలకు ఆర్థిక సాయం అందించాలన్న ఆంధ్రప్రదేశ్

తెలంగాణ వాదనకు కేంద్ర హోంశాఖ మద్దతు

మన తెలంగాణ/ హైదరాబాద్:  సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వాటాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల మధ్య జరిగిన వాదనలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలంగాణ వాదనలోనే బలముందని, తెలంగాణ వాదన చట్టబదద్దంగా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. తెలుగు రాష్ట్రాల విభజన వివాదాలను పరిష్కరించడానికి బుధవారం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ బృందం, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మ అధికారుల బృందం పాల్గొంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో తెలంగాణ రాష్ట్రానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటాలున్నాయేగానీ ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని, ఇది విభజన చట్ట ప్రకారమే ఉన్న నిబంధనని, దీనిపై ఏపీ ప్రభుత్వం అడ్డంతిరిగి వాదించడంలో అర్ధంలేదని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కాస్తంత ఘాటుగానే ఏపీపై ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎస్ వాదనలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి  అజయ్‌భల్లా కూడా అంగీకరించి తెలంగాణ వాదనలోనే వాస్తవముందని అంగీకరించారు.

సింగరేణి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తే ఎలాంటి అభ్యర్ధనను కూడా స్వీకరించ కూడదని తెలంగాణ సీఎస్ కోరగా అందుకు హోంశాఖ కార్యదర్శి అంగీకరించినట్లు తెలిసింది. అంతేగాక సింగరేణి కాలరీస్‌కు అనుబంధంగా ఉన్న ఏపీహెచ్‌ఎంఈఎల్ (ఆప్మెల్) యాజమాన్యానికి సంబంధించిన సమస్యపైన కూడా తెలంగాణ సీఎస్ గట్టిగా పట్టుబట్టారు. భవష్యత్తులో కూడా ఆప్మెల్ తెలంగాణకే కొనసాగుతుందని సీఎస్ సోమేష్ కుమార్ స్పష్టంచేశారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఎనిమిది కీలకమైన అంశాలను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్ళగా ఏపీ ప్రభుత్వం కూడా తొమ్మిది అంశాలపై తమ వాదనలను వినిపించింది. విభజన వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలున్నప్పటికీ కోర్టులను ఆశ్రయించి స్టే ఆర్డర్‌లు తెచ్చుకోవడంతో ఈ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని కూడా తెలంగాణ సీఎస్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్ళారు. ఇలా ఇరు పక్షాల నుంచి తీవ్రస్థాయిలో వాదోపవాదాలు విన్న తర్వాత ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళతానని, త్వరలోనే కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను ఇద్దరు చీఫ్ సెక్రటరీలకు వివరిస్తానని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలకు ఏకంగా 12,111 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉందని, ఆ విషయాన్ని పక్కనబెట్టి తెలంగాణ నుంచే వారికి 3,442 కోట్ల బకాయిలు రావాలని ఏపీ అభ్యర్ధిస్తోందని, ఇది కరెక్టు కాదని తెలంగాణ సీ.ఎస్. కేంద్రహోంశాఖ కార్యదర్శి వివరించారు. సీలేరు జల విద్యుత్తు ప్రాజెక్టు నుంచి తక్కువ ధరకే విద్యుత్తు అందుబాటులో ఉన్నప్పటికీ తమకు దక్కకుండా పోయిందని తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తంచేసింంది. విద్యుత్తు రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం 2014లో నీరజా మాథూర్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించిందని, ఆ కమిటీ గడచిన ఏడున్నర ఏళ్ళల్లో అనేక సమావేశాలు నిర్వహించినప్పటికీ ఇంకా నివేదికను సమర్పించలేదని తెలంగాణ సీఎస్ అసంతృప్తిని వ్యక్తంచేశారు. విద్యుత్తు బకాయిల విషయంలో తలెత్తిన అభిప్రాయభేధాలపై ఏపీ విద్యుత్తు సంస్థలు హైకోర్టులో కేసును దాఖలు చేశాయని, ఈ బకాయిల మొత్తాలను తేల్చుకునేందుకు వీలుగా కేసులు ఉపసంహరించుకోవాలని తాము కోరినట్లుగా తెలంగాణ సీఎస్ వివరించారు.

షెడ్యూలు 9లోని సంస్థలకు సంబంధించిన వివాదాల్లో డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్‌కు కేటాయించిన అయిదు వేల ఎకరాల భూముల విషయంలో ఏపీ షరతులను ఉల్లంఘించినందున తెలంగాణ ప్రభుత్వం 2015లో తిరిగి ప్రారంభించిందని సీఎస్ నివేదించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పోరేషన్‌లోనూ ఏపీ ప్రభుత్వం షరతులను ఉల్లంఘించినందున ఆ సంస్థకు కేటాయించిన 250 ఎకరాలను తిరిగి ప్రారంభించామని, దీనికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చుకుందని సీఎస్ సోమేష్ కుమార్ వివరించారు. ఇలా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు కేసుల కారణంగా షెడ్యూలు 9లోని సంస్థల విభజన సమస్య మొత్తం పెండింగ్‌లో ఉందని సీఎస్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వివరించారు. షెడ్యూలు పదిలోని సంస్థకు సంబంధించిన వివాదాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా 2017లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని, ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో రిట్ పిటీషన్‌ను దాఖలు చేసిందని, ఈ రిట్‌ను ఉపసంహరించుకోవాలని, లేకుంటే షెడ్యూలు పదిలోని విద్యాసంస్థలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావని కూడా తెలంగాణ సీఎస్ వివరించారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తులు, భూముల విభజన వివాదంపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతూ వచ్చిందని, ఈ ఉమ్మడి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పంపకాలు చేసుకోవచ్చునని సూచించినప్పటికీ ఏపీ ప్రభుత్వం కలిసి రావడంలేదని సీఎస్ వ్యాఖ్యానించారు.

ఈ ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ కార్యదిర్శ అజయ్‌భల్లా కూడా ఏకీభవించారని తెలిసింది. నగదు నిల్వలు, బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ల విభజన సమస్యపైన ఏపీ ప్రభుత్వం సొమ్ము చెల్లించడంలేదని తెలంగాణ సీఎస్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర పథకాలకు సంబంధించిన నిధుల్లో 495 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం విధిగా తెలంగాణకు చెల్లించాల్సి ఉందని, ఏడు సంవత్సరాలుగా ఈ బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. అదే విధంగా హైకోర్టు, రాజభవన్ తదితర ఉమ్మడి సంస్థలపై 315 కోట్ల రూపాయల ఖర్చుకు సంబంధించిన సొమ్ముపై ఏపీ తమకు బకాయిలు చెల్లించాల్సి ఉందని, నిర్మాణాల్లో ఉన్న భవనాలపై వాటా, సంక్షేమ నిధిలోని 456 కోట్లు, 208 కోట్ల నికర క్రెడిట్ ఫార్వార్డ్‌ను పునఃప్రారంభించడం వంటి పరస్పరం ఆమోదం పొందిన నిధులను కూడా ఏపీ ప్రభుత్వం ఇవ్వడంలేదని సీఎస్ సోమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మ కూడా తెలంగాణ రాష్ట్రంపై కొన్ని ఫిర్యాదులు చేశారు. విద్యుత్తు రంగంలో సుమారు ఆరు వేల కోట్ల రూపాయల నిధులను తెలంగాణ డిస్కంలు తప్పనిసరిగా ఏపీకి చెల్లించాల్సి ఉందని అన్నారు. మరోవైపు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతోపాటుగా దుగరాజపట్నం, రామాయపట్నం ఓడరేవుల నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహకారం అందించాలని కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను ఏపీ సీఎస్ సమీర్‌శర్మ కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరు రాష్ట్రాలకు చెందిన ఆర్ధికశాఖ, విద్యుత్తుశాఖ, రాష్ట్ర విభజన విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News