మనతెలంగాణ/హైదరాబాద్: గనిలో జరిగిన ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరమని, మృతుల కుటుంబీకులకు సిఎండి ఎన్.శ్రీధర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. అడ్రియాల లాంగ్‌వాల్ గనిలో సోమవారం పై కప్పు కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందడంపై సిఎండి శ్రీధర్ తీవ్ర విచారాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని, ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది గనిలోకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన ఆరుగురిలో ముగ్గురిని సాహసోపేతంగా రక్షించగలిగారని, మిగిలిన వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని సిఎండి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
రక్షణపై ఖర్చుకు వెనకాడకుండా గనుల్లో చర్యలు తీసుకుంటున్నామని, అయినా ఇటువంటి ఊహించని దుర్ఘటన జరిగి ముగ్గురిని కోల్పోవడం ఎంతో బాధించిందని ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే సంస్థ డైరెక్టర్లు గని వద్దే ఉండి రెస్క్యూ, సహాయ చర్యలను పర్యవేక్షించారని, బాధిత కుటుంబీకులకు సింగరేణి సంస్థ పూర్తిగా అండగా ఉంటుందని సిఎండి తెలిపారు. మృతి చెందిన వారికి చెల్లించాల్సిన మొత్తాలను వెంటనే వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని, వారి కుటుంబాల్లో అర్హులైన వారికి వెంటనే వారు కోరిన చోట ఉద్యోగం కల్పిస్తామని చైర్మన్ పేర్కొన్నారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా అన్ని గనుల్లో రక్షణ తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు వెంటనే చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Singareni CMD Respond on Coal Mine Roof collapse