సిఎండిగా బలరామ్ నాయక్‌కు బాధ్యతలు
జిఎడిలో రిపోర్టు చేయాలని శ్రీధర్‌కు సిఎస్ ఆదేశం
డిప్యూటేషన్ గడువు ముగియడంతో రిలీవ్ చేసిన ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తొమ్మిదేళ్ళుగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు సిఎస్ ఉత్తర్వులు జారీచేశారు.జిఎడిలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. మరోవైపు సింగరేణి నూతన సిఎండిగా ఐఆర్‌ఎస్ అధికారి, సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్.బలరామ్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బలరామ్ మం౦గళవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలని సిఎం ఈ సందర్భంగా ఆదేశించగా తగినంత బొగ్గు రవాణాను ఎటువంటి కొరత లేకుండా చూస్తామని, అదే విధంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు నిరంతరాయంగా అందచేస్తామని, ఈ సందర్భంగా సిఎండి బలరామ్ సిఎంకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహాకారంతో ఓడిషా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ నుంచి ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తిని సాధిస్తామని తెలిపారు.అదే విధంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్దిక, ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క, సిఎస్ శాంతకుమారి, సిఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.