Thursday, January 23, 2025

బొగ్గు..ధర భగ్గు

- Advertisement -
- Advertisement -

సింగరేణిలో బొగ్గు ఉత్పాదక వ్యయం అధికంగా ఉన్నందున దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థలపై ఆర్థికభారం ఎక్కువగా ఉంటోంది. ఈ మేరకు బొగ్గు సరఫరా చేస్తున్న మహానది కోల్ ఫీల్డ్, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ సంస్థలతో పోలిస్తే సింగరేణి బొగ్గు ధర సగటున వివిధ గ్రేడ్‌లను పరిశీలిస్తే దాదాపు 2 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది దేశంలోనే అత్యధికమని అధికార వర్గాలు అంటున్నాయి. సింగరేణి బొగ్గు ధరలను దేశంలోని ఇతర కంపెనీలతో పోల్చి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది. నాణ్యతను బట్టి బొగ్గును గ్రేడ్‌లవారీగా ధరలు నిర్ణయించి విక్రయిస్తారు. ఈ మేరకు మట్టి, బూడిద శాతాలు తక్కువగా ఉండే జీ5 గ్రేడ్ బొగ్గును (టన్నుకు) సింగరేణి రూ.5,685కి విక్రయిస్తే మహానది, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ రూ.2,970కే అమ్ముతున్నాయి. అలాగే జీ16 గ్రేడ్‌ను సింగరేణి రూ.1,620కి విక్రయిస్తుంటే మహానది రూ.514, వెస్ట్రన్ రూ.614కే ఇస్తున్నాయి.

ఇలా జీ5 నుంచి జీ17 దాకా ఒక్కో గ్రేడ్ ధర టన్నుకు ఎంతనేది వివరిస్తూ సింగరేణి సంస్థ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. సింగరేణిలో ఖర్చులు చాలాఎక్కువగా ఉండటంతో పాటు కార్మికులు, భారీయంత్రాల వినియోగ సమయం చాలా తక్కువగా ఉన్నందున బొగ్గు టన్నుకు సగటు ఉత్పాదక వ్యయం అధికంగా ఉన్నట్లు వివరించింది. ఈ వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఎక్కువగా జీ9, జీ10, జీ11, జీ12 గ్రేడ్‌ల బొగ్గును సింగరేణి సరఫరా చేస్తోంది. ఈ గ్రేడ్‌ల బొగ్గులో నాణ్యత తక్కువగా ఉండటం వల్ల విద్యుదుత్పత్తి కోసం మండించినప్పుడు అధిక పరిమాణంలో వినియోగించాల్సి వస్తోందని విద్యుత్ ఇంజినీర్లు తెలిపారు. సింగరేణి నుంచి సరఫరా అవుతున్న బొగ్గులో నాణ్యత లేక బూడిద ఎక్కువగా వెలువడుతోందని, మట్టిని తొలగించి నాణ్యమైనది పంపాలని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) కూడా ఇటీవల సింగరేణికి రెండుసార్లు లేఖలు రాసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News