కొనుగోలు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరణ
రిజిస్టర్డు వినియోగదారుల కోసం
సింగరేణి ప్రత్యేక పోర్టల్ ప్రారంభించిన ఇడి ఆల్విన్
హైదరాబాద్ : దేశంలో సాంకేతిక వినియోగంలో ఇతర బొగ్గు సంస్థలకు సింగరేణి ఆదర్శంగా నిలుస్తోందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) ఆల్విన్ అన్నారు. సిఎండి ఎన్.శ్రీధర్ మార్గనిర్దేశంలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ తన సేవలను మరింత సరళతరం చేస్తోందని పేర్కొన్నారు. విద్యుతేతర రంగం వినియోగదారుల నుంచి బొగ్గు కొనుగోలు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించడానికి రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్‌ను గురువారం సింగరేణి భవన్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్విన్, జనరల్ మేనేజర్ కె.సూర్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆల్విన్ మాట్లాడుతూ, పని భారాన్ని తగ్గించడానికి, వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు.
మంచి సాఫ్ట్‌వేర్ ఆప్లికేషన్‌ను రూపొందించిన ఐటీ విభాగానికి, మార్కెటింగ్, సేల్స్, ఫైనాన్స్ విభాగాలకు అభినందనలు తెలిపారు. రిజిష్టర్డు వినియోగదారులు https://scclmines.com/ వెబ్ సైట్‌లో కస్టమర్ కార్నర్‌ను క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్ సేవలను పొందడానికి వీలుంటుందని చెప్పారు. జనరల్ మేనేజర్ కె.సూర్యనారాయణ మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో వినియోగదారులు కార్యాలయాలకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండే ఆన్‌లైన్ వ్యవస్థను రూపకల్పన చేసినట్లు తెలిపారు. కొత్త అప్లికేషన్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తామని, తద్వారా కార్యాలయాలకు వచ్చే అవసరం ఉండదని చెప్పారు.
పూర్తి పారదర్శకతకు, సులభతరమైన సేవలు అందించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. వినియోగదారుల అభ్యర్థన ఏ విభాగం వద్ద ఉందో చూసుకోవచ్చని వివరించారు. సకాలంలో వాటిపై స్పందించడానికి అవకాశం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎజిఎం రాజేశ్వర్ రావు, డిజిఎంలు ఎన్.వి.రాజశేఖర్, తాడబోయిన శ్రీనివాస్, మారపెల్లి వెంకటేశ్వర్లు, హరిప్రసాద్, ఎస్వోఎం సురేందర్ రాజు, డిప్యూటీ మేనేజర్ మహేందర్ రెడ్డి, మార్కెటింగ్, సేల్స్, ఫైనాన్స్, ఐటీ విభాగం అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Singareni Coal Purchase Process Simplified