అత్యధిక ఎరియర్స్ పొందిన ఉద్యోగులకు చెక్కుల అందజేత
సగటున ఒక్కో కార్మికునికి మూడు లక్షల 70 వేల రూపాయల వరకూ ఎరియర్స్
అత్యధికంగా 9 లక్షల 91 వేలు పొందిన రామగుండం ఏరియా హెడ్ ఓవర్ మెన్
దసరా, దీపావళి బోనస్‌లు కూడా ఇలాగే సకాలంలో చెల్లిస్తాం: ఫైనాన్స్ డైరెక్టర్ బలరామ్
మన తెలంగాణ / హైదరాబాద్: సింగరేణి కార్మికులకు 11వ వేజ్ బోర్డు బకాయిలు 1450 కోట్ల రూపాయలను యాజమాన్యం గురువారం మధ్యాహ్నం విడుదల చేసింది. సంస్థ చైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు ఫైనాన్స్, పర్సనల్ డైరక్టర్ ఎన్.బలరామ్ హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా 39 వేల మంది కార్మికుల ఖాతాల్లోకి ఈ ఎరియర్స్‌ను మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం.సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్.బలరామ్ మాట్లాడుతూ సింగరేణి చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఒకే దఫా ఎరియర్స్ మొత్తం చెల్లించడం ఇదే తొలిసారి అన్నారు.
తొలుత రెండు దఫాలుగా ఎరియర్స్ చెల్లించాలని భావించినప్పటికీ, సంస్థ ఛైర్మన్ మరియు ఎండి ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు అనుకున్న సమయానికి కన్నా ముందే ఒకేసారిగా ఎరియర్స్ చెల్లింపుకు సన్నాహాలు పూర్తి చేశామన్నారు. 11వ వేజ్ బోర్డు జీతాలను కూడా సింగరేణి సంస్థ కోల్ ఇండియా కన్నా ముందే అమలు జరిపిందని ఆయన గుర్తు చేశారు. 11వ వేజ్ బోర్డు ఎరియర్స్ కోల్ ఇండియాలోని కొన్ని సబ్సిడరీ కంపెనీలు ఇంకా చెల్లించలేదని, దశలవారీగా చెల్లించడానికి సమాయత్తం అవుతున్నాయని తెలిపారు. కానీ సింగరేణి సంస్థ ఒకేసారిగా ఎరియర్స్ ను కార్మికుల ఖాతాల్లో జమ చేసిందని పేర్కొన్నారు. కార్మికులకు చెల్లించే ఎరియర్స్ లో ఇన్ కంటాక్స్, సీఎంపిఎఫ్, పెన్షన్ కు చెల్లించాల్సి ఉన్న సొమ్మును మినహాయించి మిగిలిన మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు.అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన 700 కోట్ల రూపాయల లాభాల బోనస్ ను దసరా పండుగకు ముందుగానే చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని, అలాగే దీపావళి బోనస్ గా పేర్కొనే పి.ఎల్.ఆర్ బోనస్ ను కూడా ఆ పండుగకు ముందే చెల్లించడానికి సంసిద్ధంగా ఉన్నామన్నారు.
ఎరియర్స్ బోనస్ చెల్లింపుల విషయాల్లో కొందరు అనవసర అపోహలు కలిగిస్తున్నారనీ, వీటిని కార్మికులు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ఎవరూ అడగకముందే ఎరియర్స్, బోనసుల చెల్లింపును సింగరేణితన బాధ్యతగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు.పెద్ద మొత్తంలో ఎరియర్స్ పొందిన కార్మికులు ఈ సొమ్మును పొదుపుగా వాడుకోవాలని, కుటుంబ భవిష్యత్తుకు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మిక సంక్షేమానికి సింగరేణి సంస్థ అంకితమై పనిచేస్తుందని ఉద్యోగులు కూడా తమ పని గంటలు సద్విని చేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని, ఇదే విధంగా మరిన్ని లాభాలు, సంక్షేమం అందుకోవాలని పిలుపునిచ్చారు.హైదరాబాద్ సింగరేణి భవన్లో అత్యధిక ఎరియర్స్ పొందిన లచ్చయ్య, (రూ 6.97 లక్షలు) రవి బాబు (రూ.6.81 లక్షలు) సత్యనారాయణ రెడ్డి (6.69లక్షలు) లకు ఫైనాన్స్ డైరెక్టర్ బలరామ్, జిఎం కోఆర్డినేషన్ ఎం.సురేష్ చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం జనరల్ సెక్రెటరీ, ఎన్ వి.రాజశేఖర్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, అధికారులు, ఉద్యోగులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రూ.9.91 లక్షలతో సింగరేణి టాపర్ గా సుదర్శన్ రెడ్డి
గురువారం నాడు 11 వ వేజ్ బోర్డు ఎరియర్స్ పొందిన వారిలో సింగరేణి టాపర్ గా రూ.9.91 లక్షలు పొందిన రామగుండం ఒకటి ఏరియా కు చెందిన వేముల సుదర్శన్ రెడ్డి నిలిచారు.రెండవ స్థానంలో రూ.9.35 లక్షలతో రామగుండం 2 ఏరియాకి చెందిన ఈ ఇపి ఆపరేటర్ మీర్జా ఉస్మాన్ బేగ్ ఉండగా, మూడో స్థానంలో రూ.9.16 లక్షలతో శ్రీరాంపూర్ ఏరియాలో హెడ్ ఓవర్ మెన్ గా పనిచేస్తున్న ఆడెపు రాజమల్లు నిలిచారు. అన్ని ఏరియాల్లో అత్యధిక ఎరియర్స్ పొందిన ఉద్యోగులను ఏరియాలో జనరల్ మేనేజర్లు ఘనంగా సన్మానించి చెక్కులని అందజేశారు. సింగరేణి యాజమాన్యం ఒకేసారి ఎరియర్సు చెల్లించడం పట్ల సింగరేణి ఉద్యోగులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.