కారుణ్య నియామక పత్రం అందజేసిన సింగరేణి జిఎం సూర్యనారాయణ
మనతెలంగాణ/హైదరాబాద్ : కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియను సింగరేణి అత్యంత వేగంగా, పారదర్శకంగా నిర్వహిస్తోందని, ఇప్పటివరకు సుమారు 12 వేల మందికి పైగా వారసులకు ఉద్యోగాలు కల్పించిందని, ఉద్యోగం పొందిన వారసులు క్రమశిక్షణ, రక్షణతో పనిచేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కోసూరి సుదర్శన్ కుమారుడు కోసూరి ద్రోణకు శుక్రవారం జిఎం సూర్యనారాయణ కారుణ్య నియామక పత్రాన్ని అందజేశారు. నూతనంగా ఉద్యోగం పొందిన యువ కార్మికులు సేఫ్టీ నిబంధనలను పాటించాలని, తద్వారా రక్షణతో కూడిన ఉత్పత్తి లో భాగస్వాములు కావాలని, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని జిఎం సూచించారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు సిఎండి ఎన్.శ్రీధర్ మార్గనిర్ధేశంలో సింగరేణిలో కారుణ్య నియామకాలను చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. విధుల్లోకి చేరుతున్న యువ ఉద్యోగులందరూ కంపెనీ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఉన్నతాధికారులు, సీనియర్ కార్మికుల సలహాలను పాటిస్తూ గనిలో సేఫ్టీ ప్రమాణాలను పాటించాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సింగరేణిని ప్రమాద రహిత సంస్థగా మార్చడమే లక్ష్యంగా పని చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, చీఫ్ లైజన్ ఆఫీసర్ బి.మహేశ్, అడిషనల్ మేనేజర్ డి.వెంకటేశం, ఎస్‌ఈ సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.