పోటీ మార్కెట్‌లో నిలబడటానికి సిద్ధంగా ఉందాం
ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనులను చేపడతాం
ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి, లాభాలు, టర్నోవర్‌లో సరికొత్త రికార్డులు సృష్టించాం
కొత్త ఉద్యోగాలు ఇస్తూ అభివృద్ధిలో దూసుకెళుతున్నాం: సింగరేణి సిఎండి శ్రీధర్
హైదరాబాద్: ఇప్పటివరకు కేవలం రాష్ట్రానికే పరిమితమై ఉన్న సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణలో భాగంగా థర్మల్, సోలార్ విద్యుత్ రంగాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకులు చేపడుతోంది. అలాగే రాష్ట్రంలో ఇతర ఖనిజ పరిశ్రమ రంగాల్లోకి కూడా అడుగుపెట్టాలని యోచిస్తోందని సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో బుధవారం జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో అనేక ప్రభుత్వ పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కొంటూ మూసివేత దిశగా కొనసాగుతున్న సందర్భంలో సింగరేణి సంస్థ మాత్రం విస్తరణ దిశగా ముందుకు పోతోందని ఆయన తెలిపారు. చాలా కంపెనీల్లో ఉద్యోగాలు తొలగిస్తుండగా సింగరేణి సంస్థ 7 ఏళ్ల కాలంలో 16 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించిందని, సంక్షేమం విషయంలో కూడా దేశంలోనే నెంబర్ 1 కంపెనీగా వెలుగొందుతుందన్నారు.
ఇతర రాష్ట్రాల్లోకి సింగరేణి
సింగరేణి సంస్థ 133 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లోకి విస్తరిస్తోందని, వచ్చే ఏప్రిల్ నెల నుంచి ఒడిస్సా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాకు నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తున్నామన్నారు. అలాగే అదే రాష్ట్రంలో న్యూపాత్రపాద బొగ్గు బ్లాకును త్వరలో ప్రారంభించబోతున్నామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వేలంలో పెట్టే ఇతర రాష్ట్రాల్లోని బ్లాకులను కూడా తాము చేపట్టే ఆలోచనలో ఉన్నామని సిఎండి స్పష్టం చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సూచన మేరకు రాష్ట్రంలో ఇనుప ఖనిజ తవ్వకాలు, ఇసుక వంటి పరిశ్రమల్లోకి కూడా విస్తరించే యోచనలో ఉన్నట్లు సిఎండి ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో మరో 12 కొత్త గనులను సింగరేణిలో ప్రారంభించుకోనున్నట్టు, అనతి కాలంలో సింగరేణి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి స్థాయికి చేరుతుందని ఆయన ఆశాభావం చేశారు.