మనతెలంగాణ/హైదరాబాద్ : 1300 అప్రెంటిస్ షిప్ పోస్టులకు సింగరేణి సంస్థ దరఖాస్తులను ఆహ్వానించింది. ఐటిఐ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే అప్రెంటిస్‌షిప్ తప్పనిసరి కావడం సింగరేణి ఆధ్వర్యంలో ఈ శిక్షణ పూర్తి చేసేందుకు వీలుకలుగుతుంది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషనిస్టు, మెకానిక్ మోటార్ వెహికిల్, డ్రాఫ్ట్‌మెన్, డీజిల్ మెకానిక్, వెల్డర్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. సింగరేణి పరిధిలోని 16 జిల్లాల అభ్యర్థులు స్థానికులుగా, మిగిలిన జిల్లాల అభ్యర్థులు స్థానికేతరులుగా గుర్తించనున్నారు. స్థానికులకు, స్థానికేతరులకు 95:05 పద్ధతిన సింగరేణి ఈ అవకాశాన్ని కల్పించనున్నట్టు తెలిపింది. రిజర్వేషన్‌కు అనుగుణంగా కులాలవారీగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని అధికా రులు పేర్కొన్నారు. అప్రెంటిస్‌షిప్ కాలపరిమితి ఏడాదిగా నిర్ణయించడంతో పాటు స్టైఫండ్ నిమిత్తం రెండు సంవత్సరాల ఐటీఐ పూర్తిచేసిన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషనిస్టు, మెకానిక్ మోటార్‌వెహికిల్, డ్రాఫట్స్‌మెన్‌లకు రూ.8,050లు, ఒక సంవత్సరం ఐటీఐ పూర్తిచేసిన డీజిల్ మెకానిక్, వెల్డర్‌లకు రూ.7,700లను అందజేయనున్నారు.
అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 18 సంవత్సరాలు నిండి 28 సంవత్సరాల లోపు, ఎస్సీ, ఎస్టీ, బిసి అభ్యర్థులు 33 సంవత్సరాల లోపు ఉండాలని సింగరేణి తెలిపింది. ముందుగా అభ్యర్థులు ప్రభుత్వ ఎన్‌ఎపిఎస్ పోర్టల్ https://www.apprenticeshipindia.gov.inలో తమ పేర్లను నమోదు చేసుకున్న అనంతరం www.scclmines.com/apprenticeship వద్ద ఎస్‌సిసిఎల్ వెబ్ పోర్టల్‌లో పేర్లను నమోదు చేయాలి. అప్లికేషన్ ప్రింట్‌ఔట్‌కు సంబంధించిన హార్డ్ కాపీలను ఏదైనా ఏరియా ఎంవిటిసిలలో తేదీ 8 ఆగస్టు, 2022 సాయంత్రం 5గంటలలోపు సమర్పించాలని సింగరేణి అధికారులు తెలిపారు.